రంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నూతనోత్తేజంతో ముం దుకెళ్తున్నది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రజాసమస్యల పరిష్కా రం కోసం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పలు రకాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది. ఇప్పటికే ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలపై పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ భవిష్యత్తులో మరిన్ని ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు, సర్‌పై అవగాహన వంటి కార్యక్రమాలతో పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తున్నది. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
డబుల్బెడ్రూంలు, డంపింగ్‌యార్డు, ఫీజుల రద్దుపై ఆందోళనలు
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో డబుల్బెడ్రూంలను రాజకీయాలకతీతంగా అర్హులకే కేటాయించాలని, ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ కమిటీల ద్వారా కాకుండా అర్హులకు ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశా రు. మరోవైపు షాద్‌నగర్ నియోజకవర్గం, కొత్తూరు మండలంలోని సిద్ధ్దాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో సిద్ధ్దాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సిద్ధ్దాపూర్వాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
లష్కర్‌గూడలో బ్రిడ్జి నిర్మించాలని..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని లష్కర్‌గూడ గ్రామ సమీపంలో బ్రిడ్జిని నిర్మించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టకపోవడంతో కిషన్‌రెడ్డి సర్కార్ తీరును తీవ్రంగా ఖండించారు. ఈ ధర్నాకు అబ్దుల్లాపూర్‌మెట్, లష్కర్‌గూడ, అనాజ్‌పూర్, ఇమామ్‌గూడ తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తునహాజరై బీఆర్ఎస్కు సంఘీభావం తెలిపారు.
కొహెడ మార్కెట్ ఏర్పాటును నిరసిస్తూ..
కొహెడ సమీపంలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో అంతర్జాతీయ స్థాయిలో పండ్లమార్కెట్‌ను నిర్మించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేసింది. ఆ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలొచ్చి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఆ స్థలాన్ని రేవంత్ సర్కార్ టీజీఐఐసీకి బదలాయించి.. గుట్టలతోపాటు పలు కోర్టు కేసులున్నా భూములను పండ్లమార్కెట్కు కేటాయించింది. ఆ కేటాయింపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనకు బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది మాజీ కౌన్సిలర్లు మద్దతిచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
వివాదాస్పదమైన నిధుల రద్దు
జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పారర్టీ ఆ నిధులను ఇతర పనులకు మళ్లించింది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులను ఇతర పనులకు వినియోగించడంపై బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
క్యాడర్లో నూతనోత్తేజం
జిల్లాలో బీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు, సర్‌పై అవగాహన వంటి కార్యక్రమాలతో క్యాడర్లో నూతనోత్తేజం నెలకొన్నది. ఇప్పటికే రాజేంద్రనగర్, షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టారు. వీటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. త్వరలోనే చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోనూ సభ్యత్వ నమోదు, సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.