పెద్దఅంబర్‌పేట, మార్చి 17 : కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయినా బీఆర్ఎస్ కార్యకర్తలను ఏమీ చేయలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలమంతా కలిసొస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొట్టుకుపోతారని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మన్సూరాబాద్ డివిజన్లో ఈ నెల 12న నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పాల్గొనలేదు. అవే కార్యక్రమాలను కార్పొరేటర్ సోమవారం నిర్వహిస్తుండగా డివిజన్ బీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, నాగరాజు, జగదీశ్ తదితరులు శాంతియుతంగా నిరసనకు దిగారు. వారిని హయత్‌నగర్ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులను సుధీర్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. చేసిన శంకుస్థాపనలనే కార్పొరేటర్లు మళ్లీ చేస్తుండటంతో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులతో దురుసుగా ప్రవర్తించి, పేర్లు అడిగి మరీ కొట్టి, కాళ్లతో తొక్కి, బూతులు తిట్టి, వెటకారంగా మాట్లాడిన హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎక్కువ కాలం పోలీసులతో రాజకీయం చేయలేరని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఇలాంటి చిల్లర పనులు చేసే నాయకులు మరోసారి ఇదే తరహా చేస్తే ప్రజలే తిరగబడతారన్నారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు విఠల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, సాగర్‌రెడ్డి, పద్మానాయక్, భవాని, ఇతరులు ఉన్నారు.