రంగారెడ్డి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/పరిగి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఊరూరా, వాడవాడల్లో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించి, సంబురాలు జరుపుకొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, షాద్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే అంజ య్యయాదవ్, ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని పరిగిలో పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఎగురవేశారు.ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ కృషి మరువలేనిదన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి అనేక ఉద్యమాలు చేసి రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. రాష్ర్టాన్ని సాధించిన ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పదేండ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు.
కేసీఆర్ హయాంలో ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే జిల్లాల్లో అభివృద్ధిలో కుంటుపడిందన్నా రు. అలాగే, రియల్ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా కుదేలైందని విమర్శించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కేసీఆర్ రాగానే తెలంగాణకు మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన జనం కేసీఆర్ పాలనకోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. గ్రామ గ్రామాన ఎగురుతున్న గులాబీ జెండాతో ప్రజల గుండె చప్పుడు మార్మోగుతున్నదని.. కేసీఆర్ సారే రావాలి.. కారు సర్కారే కావాలని ఎలిగెత్తి చాటుతున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్‌తోనే శ్రీరామ రక్ష అని అన్నారు.
