వికారాబాద్, జూన్ 21 : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడమేనా మీ పాలన? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకుల మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేతగాక, ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజల దృష్టి మళ్లించటానికి ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, కేసులు నమోదు చేసినా, అరెస్టులు చేసినా ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని మెతుకు ఆనంద్ తేల్చిచెప్పారు.