సిటీబ్యూరో : జలమండలి ట్యాంకర్ల బుకింగ్‌లో రిజర్వాయర్ ఇన్చార్జీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ట్యాంకర్ ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులను పక్కన పెట్టి ఒక్కో ట్యాంకర్‌కు గరిష్ఠంగా రూ. 500 వరకు అదనంగా తీసుకుని టోకెన్ నంబర్ రాకున్నా తమకు అనుకూలమైనవారికి డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముందుగా బుక్ చేసుకున్నవారు 4-5 రోజులు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. జలమండలి పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఇదే కొనసాగుతున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ఇళ్లలోని బోర్లు ఎండిపోవడానికి తోడు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు సరిపోకపోవడంతో మెజార్టీ వినియోగదారులు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.
ఇప్పటికీ వేలల్లో ట్యాంకర్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. రిజర్వాయర్ ఇన్చార్జిలు దీన్నే అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి పాల్పడతున్నట్లు సమాచారం. ఈ అక్రమ దందా సంబంధిత మేనేజర్లకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ దందా ఎస్ఆర్ నగర్-1, ఎస్ఆర్నగర్-2 రిజర్వాయర్లలో విచ్చలవిడిగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా అక్రమ దందా మానుకుని ట్యాంకర్లను వరుస క్రమంలో డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.