పరిగి, జనవరి 4 : సాధారణంగా గుర్రాల పందెం, సంక్రాంతికి కోళ్ల పందెం జరుగుతుంటుంది. కానీ పావురాలతో పందెం నిర్వహించేందుకు వచ్చిన వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించగా పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం సమయంలో పరిగి లక్ష్మీనగర్‌లో ఓ ట్రాలీ ఆటోలో తీసుకువచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ ఎవరో పావురాలు తీసుకువచ్చి వదులుతున్నారని తెలియజేయడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అప్పటికే సుమారు 30 పావురాలు ఎగిరిపోగా 250 పావురాలతో కూడిన బాక్సులను స్వాధీనం చేసుకొని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరుట్లకు చెందిన ప్రేమ్‌కుమార్ పావురాలకు శిక్షణ ఇస్తాడు. అనంతరం పావురాలతో పందెం నిర్వహిస్తుంటాడు. ఇందులో భాగంగా గోరుట్లకు సుమారు 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల దూరం పావురాలను బాక్సుల్లో తీసుకెళ్లి వదిలిపెట్టగా ముందుగా గోరుట్లకు చేరుకున్న పావురం గెలుపొందినట్లు ప్రకటిస్తారు. ప్రతి పావురానికి ఒక కోడ్ నెంబర్ ఇవ్వడంతోపాటు వాటి కాలుకు ట్యాగ్ చేస్తారు. గెలిచిన పావురంపై పందెం కట్టిన వారికి డబ్బులు ఇస్తారు.
ఈ పావురాలతో పందెం తతంగం గత కొంతకాలంగా జరుగుతున్నట్లు తెలిసింది. పందెం కోసమే ఇక్కడికి తీసుకొచ్చి వదిలేందుకు వచ్చినట్లు పట్టుబడిన వారు పోలీసుల విచారణలో తెలిపారు. పావురాల పందెంతో ఈ ప్రాంతం వారికి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా లేదా అనేది పోలీసుల విచారణలో తేలనున్నది. ఇదిలావుండగా పావురాలతో పందెంకు సంబంధించి ప్రేమ్‌కుమార్, బాబాజాన్, మున్వర్లపై గేమింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రుయాలిటీ కింద కేసులు నమోదు చేసినట్లు దోమ ఎస్ఐ ఆనంద్‌కుమార్ తెలిపారు. పట్టుబడిన బాబాజాన్, మున్వర్లను రిమాండ్‌కు తరలించడం జరుగుతుందని ఎస్ఐ పేర్కొన్నారు.