ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డప్పుల వాయిద్యాల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గ్రామ దేవతల దేవాలయాలకు చేరుకుని భక్తిశ్రద్ధలతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం చల్లంగ చూడు తల్లీ.. అంటూ ప్రత్యేక పూజలు చేయడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
ఇబ్రహీంపట్నం, జూలై 9 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మహంకాళి అమ్మవారి బోనాలను ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోనాలను సమర్పించేందుకు అమ్మవారి ఆలయం వద్ద బారులు తీరారు. సోమవారం ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలోని వీరభద్ర నగర్ కాలనిలో పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలను ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వసంతం, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వినోద్ కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని హాజిపల్లి, లింగారెడ్డిగూడతో పాటు వివిధ గ్రామాల్లో ఆదివారం గ్రామదేవతల బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. రేపు పోచమ్మ బోనాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.