ఇబ్రహీంపట్నం, జులై 18 : కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో గ్రామీణప్రాంత రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి విజయవాడ హైవేలోని తూప్రాన్పేట్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేశారు. ముఖ్యంగా రాయపోల్ గ్రామంలో రోడ్డు వెడల్పు చేయకపోవటంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, నిరసిస్తూ శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రోడ్డుపై నిలిచిన నీటిలో గ్రామస్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వరినాట్లు వేసి, స్థానిక ఎమ్మెలే మల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు హాయాంలో గ్రామీణ రోడ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. రాయపోల్ గ్రామంలో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలుమార్లు కోరినప్పటికి పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. నిరసనగా రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.