మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించిన బిల్లులు నెలల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్నది. పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలకు తోడు పేరుకుపోయిన బకాయిలతో పథకం నిర్వహణ ఏజెన్సీలకు ఆర్థికంగా భారంగా మారింది. రంగారెడ్డి జిల్లాలో పెండింగ్ బకాయిలు రూ.4కోట్ల వరకు ఏజెన్సీలకు రావాల్సి ఉన్నది. అప్పులు తెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులను చెల్లించని పక్షంలో ధర్నా చేసే ఆలోచన చేస్తున్నట్లు ఏజెన్సీల మహిళలు పేర్కొంటున్నారు.
-రంగారెడ్డి, జూన్ 19(నమస్తే తెలంగాణ
రంగారెడ్డి జిల్లాలో 1,271 పాఠశాలలు ఉండగా.. వీటిల్లో లక్షా యాభైవేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని 908 మహిళా ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. అయితే సకాలంలో బిల్లులు రాక ఏజెన్సీలకు పథకం నిర్వహణ కష్టంగా మారుతున్నది. 9, 10 తరగతుల విద్యార్థులకు సంబంధించిన బిల్లులు గత ఏడాది డిసెంబర్ నుంచి రూ.1,16,811,360 బకాయిలు పేరుకుపోయాయి. కోడి గుడ్లకు సంబంధించి మరో రూ.1,36,56,928 పెండింగ్ బిల్లులు గత డిసెంబర్ నుంచి విడుదల కావాల్సి ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది అట్టహాసంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించింది.
కొంతకాలంపాటు ఈ పథకాన్ని ఏజెన్సీలు నిర్వహించగా.. అందుకు సంబంధించిన రూ.85,24,512 బకాయిలు అలాగే ఉండిపోయాయి. 1 నుంచి 8తరగతులకు సంబంధించి బకాయిలు సైతం పెద్ద మొత్తంలో ఉండగా.. ఇటీవలనే చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉండగా.. నూతన విద్యా సంవత్సరం ఆరంభమైనా ఇంకా విడుదల కాలేదు. దీనికితోడు ఏజెన్సీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.2 వేల గౌరవ వేతనం సైతం ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల హామీలో గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. పెంచిన వేతనం మాటేమోగానీ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పెంచిన వేతనాన్ని సైతం ఇవ్వడంలేదని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలల తరబడిగా మధ్యాహ్న భోజనం బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క పాఠశాలలో ఏజెన్సీలకు రూ.3లక్షల నుంచి 4లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. రూ.3 వడ్డీకి అప్పు తెచ్చి వండి పెడుతున్నాం. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకుంటున్నారు. గౌరవ వేతనం కూడా రావడం లేదు. పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈ నెల 24న ధర్నా చేసే ఆలోచనలో ఉన్నాం.
-వై.స్వప్న, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు
కొన్ని నెలలకు సంబంధించి మధ్యాహ్న భోజనం బిల్లులను చెల్లించాల్సి ఉన్నది. బకాయి కారణంగా మధ్యాహ్న భోజనం నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నాం. బిల్లులు ఈ-కుబేర్లో పెండింగ్లో ఉన్నాయి. ఏ సమయంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఏజెన్సీలు ఆందోళన చెందవద్దు.
– సుశీంధర్రావు, రంగారెడ్డి డీఈవో