ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 4 : గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని 25 డిపోల్లో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో సిబ్బంది ఉత్తమ సేవలకు గుర్తింపుగా మంగళవారం ఉత్తమ అవార్డు అందుకున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా నష్టాల్లో కొనసాగుతున్న ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోను 2022-23 సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాభాల బాటలో నడిపించినందుకు మంగళవారం నగరంలోని కళాభవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీఎం అశోక్‌రాజుకు అవార్డు అందజేశారు. అవార్డుతోపాటు రూ.2లక్షల రివార్డు బహుమతిని డిపోకు అందించారు. ఈ సందర్భంగా అశోక్‌రాజు మాట్లాడుతూ.. నష్టాలను అధిగమించేందుకు సిబ్బందితో క్రమశిక్షణతో పనులు చేయించడంతో పాటు ట్రిప్పులు అధికంగా నడుపటం వలన డిపోకు మంచి లాభాలు వచ్చాయి. 2022-23 సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 డిపోల్లో కంటే అధిక లాభాలు గడించినందున డిపోకు మొదటి బహుమతితోపాటు రాష్ట్రస్థాయిలో మూడోస్థానంలో నిలిచినందున ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ అవార్డు మా సిబ్బందితోపాటు మాకు మరింత బాధ్యతను తెచ్చిపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు.