యాచారం, జూలై 31 : మండలంలోని మేడిపల్లి గ్రామంలో పింఛన్ కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పడిగాపులు గాస్తున్నారు. జూలై ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్ డబ్బు లు ఆగస్టు నెల వచ్చినా చేతికి అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం ఆరుగంటలకే లబ్ధిదారులు పోస్టాఫీస్ వద్దకు వెళ్లి పింఛన్ పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి పోస్ట్‌మన్ కోసం ఎదురు చూశారు. మధ్యాహ్నం దాటినా అతడు రాకపోవడంతో నిరాశతో ఇంటికి వెనుదిరిగారు. గత మూడు రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మేడిపల్లి గ్రామానికి చెందిన పోస్టుమన్ మేడిపల్లితోపాటు మల్కీజ్‌గూడ, నానక్‌నగర్ గ్రామాల్లోనూ పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తుండడంతో మేడిపల్లిలో ఆలస్యంగా పంచుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆసరా పింఛన్లను ఆలస్యం గా పంపిణీ చేయడమే కాకుండా రెండు, మూడు రోజులు ఆలస్యంగా వచ్చిన వారికి డబ్బులు అయిపోయాయని.. వచ్చే నెల తీసుకోవాలని పోస్ట్‌మన్ చెబుతున్నారని, అంతేకాకుండా చిల్లర డబ్బులను కూడా సక్రమంగా ఇవ్వడంలేదని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేడిపల్లిలోనే కాదు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ లబ్ధిదారుల నుంచి పోస్ట్మన్లు చిల్లర లేవనే సాకుతో రూ. 16, రూ. 10, రూ. 5, రూ. 1 చొప్పున చిల్లర కాజేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కాగా ఆసరా లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లను పంపిణీ చేయాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య డిమాండ్ చేశారు.
పింఛన్ కోసం మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలోని లబ్ధిదారులు ప్రతిరోజూ గ్రామ పం చాయతీ కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక సమస్యలను కారణాలుగా చూపుతూ పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-కొడంగల్