రంగారెడ్డి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టేట ముంచింది. స్థానిక సం స్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ధోకా చేసింది. బీసీలకు 42% కల్పిస్తే.. రిజర్వేషన్లు 50% దాటుతాయని కోర్టులు తప్పుపడడంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తు లు లేవన్న కారణంతో ఎలక్షన్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. పంచాయతీల్లో బీసీలకు 23శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా 20 శాతం కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని ఆమనగల్లు మండలంలో బీసీలకు సర్పంచ్ స్థానం ఒక్క టి కూడా కేటాయించలేదు. అలాగే, కడ్తాల్, యాచారం వంటి మేజర్ మండలాల్లోనూ బీసీలకు రెండు సీట్లే కేటాయించింది. మరికొన్ని మండలాల్లోనూ 23 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదికన అయితే, ఒక్కో మండలంలో 4 నుం చి 5 స్థానాలు బీసీలకు కేటాయించాల్సి ఉండగా.. ప్రభు త్వం మాత్రం ఒక్కో మండలంలో మూడు నుంచి నాలు గు స్థానాలనే బీసీలకు రిజర్వు చేశారు. దీంతో బీసీలు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు.
జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో బీసీలకు కేవలం 92 సీట్లు మాత్రమే కేటాయించారు. గత ఎన్నికల్లో బీసీలకు 192 స్థానాలు కేటాయించగా ప్రస్తుతం వంద స్థానాల్లో సర్కా ర్ కోత విధించడంతో బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వార్డుల కేటాయింపు లోనూ బీసీలకు భారీగా గండిపడిం ది. జనాభాలో బీసీలు అధికంగా ఉన్నా రిజర్వేషన్లలో బీసీలను అణగదొక్కారని బీసీలు మండిపడుతున్నా రు. అలాగే, ఆమనగల్లు మండలం లో 13 గ్రామపంచాయతీలుండగా.. వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 7 స్థానాలు రిజర్వు కాగా మిగిలిన వాటిని జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ బీసీకి ఒక్క స్థానం కూడా లభించలేదు. దీంతో మండలంలోని బీసీలు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కొత్తూరు, కడ్తాల్ మం డలాల్లోనూ ఒకే ఒక్క స్థానంతో, యాచారం, మంచాల మండలాల్లో రెండు స్థానాలతో బీసీలు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, తలకొండపల్లి, మాడ్గుల వంటి మండలాల్లోనూ బీసీలకు 2, 3 స్థానాలనే ప్రభుత్వం కేటాయించింది.
జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలుండగా ఎస్టీ జనరల్‌కు 49, ఎస్టీ మహిళలకు 42, ఎస్సీ జనరల్‌కు 55, ఎస్సీ మహిళలకు 51, బీసీ జనరల్‌కు 50, బీసీ మహిళలకు 42, జనరల్ కేటగిరీ కింద 125, జనరల్ మహిళా కేటగిరీకి 112 కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినన్నీ స్థానాలూ బీసీలకు కేటాయించలేదు. ప్రభుత్వ రిజర్వేషన్ల తీరుపై వారు గుర్రుగా ఉన్నారు.
గత నెలలో ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల పేరుతో జిల్లాలోని పలు స్థానాలను బీసీలకు కేటాయించడంతో పలువురు పోటీచేసే అవకాశం దక్కుతుందని సంతోషిం చారు. సర్పంచ్ స్థానాలకు పోటీచేసేందుకు చాలామంది ఉత్సాహాన్ని చూపారు. కానీ, ఊహించని రీతిలో ప్రభుత్వం 23శాతం రిజర్వేషన్ల పేరుతో కల్పించిన రిజర్వేషన్లపై బీసీ సంఘాల నాయకులు విస్మయానికి గురయ్యారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లను కూడా తమకు కేటాయించకపోవటంపై గుర్రుగా ఉన్నారు. జనాబాలో బీసీలు 50% ఉన్నా భిక్షం వేసినట్లు ఒకటి రెండు స్థానాలను తమకు కేటాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ బిల్లుపై చట్టం తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చేది. ఆ బిల్లును పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. మొదటి నుంచి కాం గ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమే. గత ప్రభుత్వంలో రిజర్వేషన్లు తగ్గించారని అనేక ఆరోపణలు చేశారు. 18 నుంచి 22 శాతం బీసీలకు రిజర్వేషన్లు వస్తే.. ప్రస్తుతం 16 నుంచి 20 శాతం రిజర్వేషనే కల్పిస్తున్నారు. బొంరాస్‌పేటలో అతి తక్కువగా 11% బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. వికారాబాద్ జిల్లాలో 594 పంచాయతీలుంటే 107 (18%) జీపీల్లోనే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీపరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం బీసీలను వంచించడమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి.
– శుభప్రద్‌పటేల్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు