బొంరాస్పేట, సెప్టెంబర్ 1 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేసిన పంట రుణాల మా ఫీ ప్రహసనంగా మారింది. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు ప్రకటన తో తాము తీసుకున్న పంట రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఎంతో సంబురపడ్డా రు. తీరా రుణమాఫీ జాబితాలను చూసి హ తాశులవుతున్నారు.
జాబితాల్లో తమ పేరు లేకపోవడంతో రైతులు బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని అర్హతలున్నా తమకు ఎందుకు మాఫీ వర్తించలేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొంరాస్పేట ఎస్బీఐ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 3,372 మంది రైతులు రూ.38.09 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు.
వీరిలో మొదటి విడతలో 965 మంది రైతులకు రూ.5.79 కోట్లు, రెం డో విడతలో 551 మందికి రూ.6.16కోట్లు, మూడోవిడతలో 386 మంది రైతులకు రూ. 5.79 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. మూడు విడతల్లోనూ కలిపి 1,902 మంది రైతులకు రూ. 17. 74 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. ఇంకా 1,472 మంది రైతులకు మాఫీ కావాల్సి ఉన్నది. అన్ని అర్హలున్నా పంట రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నా రు.
వ్యవసాయాధికారులు మాత్రం ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు కావడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. రైతు లు మాత్రం రుణమాఫీ ప్రక్రియ అస్తవ్యస్తం గా ఉన్నదని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించినట్లు రైతులందరికీ ఎలాంటి నిబంధనలు, షరతుల్లేకుండా పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకు కాలేదో తెలియడం లేదు..
పంట రుణాలు మాఫీ అవుతాయని ఎంతో ఆశగా ఉన్నా. బొంరాస్పేట ఎస్బీఐ బ్యాంకులో నేను రూ.1,50,000, నా కొడుకు రూ.40 వేలు పంటల సాగు కోసం తీసుకున్నాం. ప్రభుత్వం ప్రకటించిన మూడు విడతల్లోనూ మా రుణాలు మాఫీ కాలేదు. అన్ని అర్హతలున్నా ఎందుకు కాలేదో తెలియడంలేదు. ప్రభుత్వం ప్రకటించినట్లు రైతులందరికీ రూ. రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలి.
-చాందీబాయి, బుర్రితండా, బొంరాస్పేట
మూడు జాబితాల్లోనూ పేరు రాలేదు..
పంట రుణాల మాఫీ ప్రక్రియ సక్రమంగా జరుగలేదు. అన్ని అర్హతలున్నా నా రుణం మాఫీ కాలేదు. బొంరాస్పేట ఎస్బీఐలో రూ.80 వేలు పంటల సాగుకు తీసుకున్నా. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా మూడు జాబితాల్లోనూ నా పేరు రాలేదు. ఎవరిని అడిగినా సరైన సమాధానం లేదు. ప్రతి రైతూ రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా అమలుకు వచ్చే సరికి అనేక కొర్రీలు పెట్టి.. కొందరికే మాఫీ చేసింది. ప్రభుత్వం అందరి రుణాలను మాఫీ చేయాలి
-కారేగారి శ్రావణ్గౌడ్, బొంరాస్పేట