బషీరాబాద్, ఫిబ్రవరి 17: నవాంద్గి సొసై టీ సీఈవోను తొలగిస్తూ పాలకవర్గం నిర్ణ యం తీసుకున్నది. శుక్రవారం నవాంద్గి సహకార సంఘ సభ్యులతో చైర్మన్ అల్లాపూరం వెంకట్రాంరెడ్డి సమావేశమై శనగల కొనుగోలులో జరిగిన అక్రమాలపై చర్చించి, సభ్యుల అనుమానాలను నివృ త్తి చేశారు. అనంతరం అవినీతికి పాల్పడిన సీఈవో వెంకటయ్యను తొలగిస్తూ, కొత్త సీఈవోగా బందప్పను నియమిస్తూ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతేకాకుండా రైతుల్లో విశ్వసనీయత పెంచేందుకు.. రైతులకు న్యాయం చేసేందుకు కలెక్టర్, ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ శనగల కొనుగోలు వ్యవహారంలో సీఈవో వెంకటయ్య అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సొసైటీ రైతు చట్టం(బై లా) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన సిబ్బందిని విధుల్లో కొనసాగించొద్దన్నారు.
ఈ విషయాన్ని జిల్లా అధికారులు సూచించడంతో పాలకవర్గం సమావేశమై సీఈవోగా ఉన్న వెంకటయ్యను తొలగిం చి.. అతడి స్థానంలో స్టాఫ్ అసిస్టెంట్‌గా ఉన్న బందెప్పకు సీఈవో బాధ్యతలను అప్పగించామన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి రైతుకూ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, అశోక్గౌతమ్, హన్మంత్‌రెడ్డి, గోపాల్, రంగారెడ్డి, నవీన్‌రెడ్డి, రూప్తానాయక్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఈవో వెంకటయ్య అరెస్టు
శనగల కొనుగోలు విషయంలో రైతులను మోసం చేసిన కేసులో నవాంద్గి సొసైటీ సీఈవో వెంకటయ్యను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు. అనంతరం అతడిని కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.