కొడంగల్, ఫిబ్రవరి 23 : పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ జాతర వైభవంగా సాగుతున్నది. మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నా రు. ఈ జాతరకు మండల పరిధిలోని భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాం తాల నుంచి తరలివస్తారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త కుటుంబీకులు అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అమ్మవారికి అభిషేకించి ప్రత్యేక అలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. పట్టణ మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మ వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో జాతర జరుగుతుంది.
దీంతో పంటలు బాగా పండాలని, పిల్లా పాపలను చల్లంగా చూడాలని రైతులు కోరుతూ అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. అమ్మవారిని రథంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రదిక్షిణలు చేపట్టారు. రథోత్సవంలో భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు.
రథం ఊరేగింపులో భక్తులు భండారు (కుంకుమ, పసుపు, గవ్వలు) రథంపై చల్లుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో జాతర సందర్భంగా మిఠాయి, టెంకాయలు, చిన్నారుల ఆటవస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.