పరిగి, మే 27: రైతులు పత్తి విత్తనాలను సీడ్ లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే కొనుగోలు చేయాలని పరిగి ఏడీఏ లక్ష్మీకుమారి సూచించారు. సోమవారం పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడ, కిష్టమొల్లతండా, రంగాపూర్, బసిరెడ్డిపల్లి, రాఘవాపూర్, జాఫర్పల్లి, నస్కల్, సుల్తాన్పూర్, తొండపల్లి గ్రామాల్లో రైతులతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సుల్తాన్పూర్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఏడీఏ లక్ష్మీకుమారి మాట్లాడుతూ పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పని సరిగా రసీదు పొందాలన్నారు. లైసెన్స్ లేని వారి దగ్గర విత్తనాలు కొనరాదని, వారి వివరాలు వ్యవసాయాధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. విత్తనా లు కొనేముందు తప్పనిసరిగా ఎంఆర్పీ ధర చూసుకొని, రసీదుపై సంతకాలు చేయాల్సిందిగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమాలలో వ్యవసాయ విస్తరణాధి కారులు మహిపాల్, శశాంక్, దివ్య, చంద్రకళ, విజయలక్ష్మీ పాల్గొన్నారు.
బొంరాస్పేట : వానాకాలం సీజన్లో పంటలు పండించే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసా యాధికారి అనురాధ అన్నారు. మండలంలోని కొత్తూరులో సోమవారం ఆమె రైతులకు విత్తనాల కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదని, విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పక తీసుకోవాలని సూచించారు. విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని ఏవో అనురాధ రైతులకు వివరించారు. నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోరాదని, డీలర్లు కూడా నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఏఈవో రేణుక, రైతులు పాల్గొన్నారు.
మర్పల్లి: రైతులు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రసీదును పంటలు వచ్చే వరకు భద్రపరుచుకోవాలని ఏవో వసంత అన్నారు. సోమవారం మండలం లోని సిరిపురం, బిల్కల్, పట్లూర్, మర్పల్లి, కల్ఖోడా క్లస్టర్ల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆయా క్లస్టర్ల ఏఈవోలు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లూజుగా ఉన్న బస్తాలలో విత్తనా లు అమ్మితే కొనుగోలు చేయరాదన్నారు. పంటలపై తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈవోలు మహేశ్, ప్రశాంత్, నీరజ, స్వాతి, జోత్స్న, రైతులు పాల్గొన్నారు.
పెద్దేముల్ : నకిలీ విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి షేక్ నజీరొద్దీన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొట్లపల్లి, గోపాల్పూర్, బండమీదిపల్లి, రుక్మాపూర్, ఖానాపూర్, ఇందూరు, జయరాం తండా గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయా క్లస్టర్ల ఏఈవోలు, ఏవో విత్తనాల కొనుగోళ్లకు సంబంధించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలు కొనుగోలు సమయంలో వ్యవసాయ అధికారులు సూచించిన జాగ్రత్తలను పాటించాలన్నారు. తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని, పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలన్నారు. ఎవరైనా లూజ్ విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు బాలకోటేశ్వర్ రావు, రజిత, స్వాతి, శ్రవణ్, శివరత్, పంచాయతీ కార్యదర్శులు రాజు, సుశీల, పరమేశ్, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.