పెద్దఅంబర్‌పేట, మే 15 : మృతి చెందిన వ్యక్తి ప్లాట్ కాజేసేందుకు కొందరు మోసగాళ్లు నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించారు. ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు యత్నించగా అబ్దుల్లాపూర్‌మెట్ సబ్‌రిజిస్ట్రార్ సునీతారాణి పసిగట్టి.. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..గోషామహల్‌కు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి మనకర్ ఆనంద్‌కు మండలంలోని మజీద్పూర్లో 267 గజాల స్థలం హక్కులపై జీపీఏ ఇచ్చాడు. అయితే ఆనంద్ గతంలోనే మరణించాడు.
ఈ విషయాన్ని గుర్తించిన చంపాపేటలో నివసిస్తున్న కొసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ స్థలాన్ని కాజేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా గోనకోల్కు చెందిన బోదాసు ఆంజనేయులును ప్లాట్ యజమాని ఆనంద్‌గా చూపించేందుకు నకిలీ ఆధార్‌కార్డును సృష్టించాడు. అదే సమయంలో వరంగల్‌లోని బలపాలకు చెందిన జిల్లాపల్లి సంజీవరావును చంద్రకాంత్‌గా చూపించేలా మరో ఆధార్‌కార్డును సృష్టించాడు. సాక్షులుగా గోనకోల్కు చెందిన దండుగల ఆంజనేయులు, చంపాపేటలో ఉంటున్న కురువ శ్రీనివాసులును తీసుకెళ్లాడు. వారి నుంచి భాస్కర్‌రెడ్డి కొంటున్నట్లు డాక్యుమెంట్‌నూ సిద్ధం చేయగా.. ఇం దుకు డాక్యుమెంట్ రైటర్ ఉదయ్‌కుమార్ సహకరించాడు.
అయితే, బుధవారం రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్‌కార్డు నంబర్ల నమోదు సమయంలో బయోమెట్రిక్ సరితూగలేదు. బయోమెట్రిక్ సమయంలో ఆనంద్ పేరుతో ఉన్న ఆధార్‌కార్డు నంబర్‌ను ఎంట్రీ చేయగా.. ఆంజనేయులు పేరు, చంద్రకాంత్ పేరిట ఉన్న ఆధార్‌కార్డును నమోదు చేయగా సంజీవరావు పేర్లు రావడంతో సబ్‌రిజిస్ట్రార్ సునీతారాణి అనుమానించారు. మోసం జరుగుతున్నట్టు గుర్తించారు. సబ్‌రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. ఏ1గా ఉన్న భాస్కర్‌రెడ్డి, ఏ6 శ్రీనివాసులును అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.