బొంరాస్‌పేట, జూన్ 1 : మండలంలోని బొంరాస్‌పేట, చౌదర్పల్లి ఉన్నత పాఠశాల, బొంరాస్‌పేట ప్రాథమిక, బాలికల ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మన ఊరు-మనబడి పథకం ద్వారా చేపట్టిన పనులను రాష్ట్ర సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్ శనివారం పరిశీలించారు. ఎన్ని నిధులు మంజూరయ్యాయి, మంజూరైన నిధులతో ఎలాంటి పనులు చేపడుతున్నారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బొంరాస్‌పేట ఉన్నత పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించారు.
మరుగుదొడ్లు విద్యార్థులకు సరిపోతున్నాయా అని జీహెచ్ఎం హరిలాల్‌ను అడిగారు. పాఠశాలల్లో ఏ చిన్న మరమ్మత్తు, అభివృద్ధి పని అయినా వదిలకుండా చేయించాలని సూచించారు. బడిబాట విజయవంతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఎంఈవో రాంరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు యూనిఫాం వస్ర్తాన్ని కటింగ్ చేసే పనిని పరిశీలించారు. విద్యార్థుల యూనిఫాం నాణ్యతగా కుట్టాలని పని వారిని రమేశ్ ఆదేశించారు. ఆయన జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, ఎంఈవో రాంరెడ్డి, చౌదర్పల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీహరిరెడ్డి, బొంరాస్‌పేట సీపీఎస్, జీయూపీఎస్ హెచ్ఎంలు అనిల్‌కుమార్, కాశీపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.