ఆదిబట్ల, డిసెంబర్ 4 : ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా కార్యదర్శి సునీత, ఆశ యూనియన్ అధ్యక్షురాలు కవిత, జిల్లా నాయకులు బాలరాజ్, శేఖర్, పెంటయ్య, సరస్వతి, రాధిక, భాగ్య, శ్రీలత, సుజాత, నిర్మల, కమల, జహంగీర్బేగం, 350 మంది ఆశ వర్కర్లు పాల్గ్గొన్నారు.
వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట..
వికారాబాద్, డిసెంబర్ 4 : పెండింగ్లో ఉన్న లెప్రసీ, సర్వే, పోలియో, ఓఆర్ఎస్ తదితర పనులు ఆశ వర్కర్లతో చేయించుకున్న ప్రభుత్వం.. వాటికి సంబంధించిన డబ్బులు చెల్లించాలని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవి, కె.మంగమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.10వేలు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. కేరళ రాష్ట్రంలో ఆశ వర్కర్లకు రూ.18వేలు ఇస్తున్నారని, బంగారు తెలంగాణలో మాత్రం కనీస వేతనం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆశలకు గుర్తింపు కార్డులు, యూనిఫాంలు ఇవ్వడంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు అరుణ, సుజాత, స్వరూప, అమృత, లలిత, అండాలు, చంద్రకళ, పద్మ, మంజుల, పద్మావతి, రేణుక తదితరులు పాల్గొన్నారు.