ఇబ్రహీంపట్నం, జూన్ 27 : వానకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాతల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నది. అదును దాటుతున్నా వర్షాలు కురియకపోవడంతో పంటలేసేందుకు సిద్ధం చేసిన దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటేందుకు సిద్ధంగా ఉన్న నారుమడులు ముదిరిపోతున్నాయి. ఈ పరిస్థితిలో అన్నదాత వర్షాల కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాకపోవడంతో వర్షాకాల పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
జూన్లో కురిసిన అంతంత మాత్రం వానలకు కొందరు రైతులు పత్తి, మొక్కజొన్న వేసినా.. ఆ తర్వాత వర్షాలు కురియకపోవడంతో మొలకెత్తిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో పలుచోట్ల రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి ఎండిపోతున్న పంటలకు పోసి ప్రాణం పోస్తున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తాయని దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులకు నిరాశే ఎదురవుతున్నది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేగావృతమై మబ్బులు కమ్ముకుంటున్నా సాయంత్రానికి వర్షాలు కురియడం లేదు. వేసవి ఎండలను తలపించేలా భానుడు భగభగ మండిపోతున్నాడు. రంగారెడ్డి జిల్లాలో ఈ వానకాలంలో సాధారణ వర్షాపాతంలో ఇరవై నుంచి ముప్పైశాతం కూడా వర్షాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
అప్పులు చేసి పంటల సాగు
ఈ ఏడాది వానలు కురియకపోవటంతో అన్న దాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ప్రతిరోజూ మబ్బులు కమ్ముకుంటున్నా వానలు మాత్రం కురవడం లేదు. అప్పులుచేసి ఇప్పటికే పొలాలను దున్ని నార్లు పోసుకుని రైతన్న సిద్ధంగా ఉన్నా వర్షాలు తీవ్ర నిరాశను మిగిలుస్తున్నాయి.
అన్నదాత వెనుకడుగు..
జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, జొన్నతోపాటు ఇతర కూరగాయల పంటల సాగులో రైతులు బిజీగా గడిపేవారు. కానీ, వర్షాలు సమయానికి రాకపోవడంతో పంటల సాగు విషయంలో వెనుకడుగేస్తున్నారు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయే అవకాశముందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ముదిరిపోతున్న నారుమడులు..
వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు నారుమడులు పోసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. వానలు లేకపోవడంతో నారు పెరిగి ముదిరిపోతున్నది. ఇంకా ఆలస్యమైతే ఈ నారు ఎందుకు పనికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మం డలాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఈ ఏడాది వర్షాల ఆలస్యంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.