బొంరాస్పేట, ఫిబ్రవరి 11 : దుద్యాల మండలం పోలేపల్లి ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి తేరు కార్యక్రమం డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, ఆనందోత్సాహాల మధ్య కనులపండువగా జరిగింది. తేరు ముందు ముగ్గులేసి కుంభం పోసి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తేరుపై ఉంచి ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. పటాకులు కాల్చుతూ, ఎల్లమ్మ మాతాకీ జై అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా జాతర మైదానం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు కొనసాగింది.
వందలాది మంది భక్తులు అమ్మవారి తేరును లాగడానికి పోటీలు పడ్డారు. దేవస్థానం కమిటీ చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, మేనేజర్ రాజేందర్రెడ్డి, సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో తేరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు రాత్రికి జాతరలోనే నిద్రించి శనివారం తేరును తిలకించి ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. భక్తులకు మంచినీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ వారు జాతరకు ప్రత్యేక బస్సులు నడిపారు. జాతరలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.