వికారాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : భూముల రిజిస్ట్రేషన్లకు సర్వేతోపాటు మ్యాపింగ్ తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్ల కథ కంచికేనా అనే ప్రచారం జరుగు తున్నది. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి దాదాపు ఏడాది అవుతున్నా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా, వేతనాలనివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. ప్రధానంగా వారిని రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది.
అయితే లైసెన్స్డ్ సర్వేయర్లకు నెలవారీగా ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించకుండా, సర్వే చేస్తే ఎకరానికి రూ.20లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మెజార్టీ సర్వేయర్లు ఆసక్తి చూపకపోవడంతోపాటు కమీషన్‌ను పెంచాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు. వారి అభ్యర్థన మేరకు వారం రోజుల కిందట ఎకరం సర్వే చేస్తే రూ.50లు ఇవ్వాలని.. అంతేకాకుండా ఒక్కో లైసెన్స్డ్ సర్వేయర్ నెలకు 500 ఎకరాల వరకు సర్వే చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం కమీషన్‌గా ఇచ్చే డబ్బును రూ.100లకు పెంచాలని లేదంటే పిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించాలని లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కమీషన్ డబ్బును రూ.50లకు పెంచిన అనంతరం లైసెన్స్డ్ సర్వేయర్లను విల్లింగ్ లెటర్లు ఇవ్వాలంటూ సూచించగా జిల్లాలోని మెజార్టీ లైసెన్స్డ్ సర్వేయర్లు స్పందించలేరని తెలిసింది.
జిల్లాలో 150 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించగా, వారిలో కేవలం 50 మంది మాత్రమే విల్లింగ్ లెటర్లు ఇవ్వగా.. మిగతా వారు మేం చేయలేమంటూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఫిక్స్డ్ వేతనం, పర్మినెంట్ అయ్యే అవకాశాలున్నాయని నచ్చజెప్పి బుజ్జగించేందుకు ఈ రెండు, మూడు రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులు లైసెన్స్డ్ సర్వేయర్లతో సమావేశం కానున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే కొనసాగుతామంటూ మెజార్టీ లైసెన్స్డ్ సర్వేయర్లు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
భూభారతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సర్వే, మ్యాపింగ్ తప్పనిసరిగా చేసేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభు త్వం నియమించింది. జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతోపాటు ఇతర రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రెండు విడతలుగా శిక్షణనిచ్చి ఆయా మండలాలకు వారిని కేటాయించారు. ఏడాది కిందట ఆయా మండలాలకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించిన ప్రభుత్వం ఇప్పటివరకు వారికి ఎలాంటి బాధ్యతలతోపాటు జీతాలు చెల్లించకపోవడం తో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీలు పూర్తి చేసుకున్న యువత మంచి జీతంతో కూడిన ఉద్యోగం వస్తుందని ఆశించి సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని ఈ జాబ్‌లో చేరితే కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.