కేశంపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫార్మర్ రిజిస్ట్రీ (Farmer Registry ) ఆన్ లైన్ ప్రక్రియను కేశంపేట వ్యవసాయశాఖ అధికారిణి శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలో ఏఈవో వినయ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఆన్లైన్ నమోదు తీరును పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరాలంటే ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. మండలంలోని ఆరు క్లస్టర్లు కేశంపేట, లేమామిడి, అల్యాల, ఇప్పలపల్లి, తొమ్మిదిరేకుల, కొత్తపేటల్లో ఆన్లైన్ నమోదు ప్రక్రియ సాగుతుందని, ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జీరాక్స్ పత్రాలతోపాటు ఆధార్‌కు లింక్ ఉన్న మొబైల్‌ను తీసుకెళ్లి ఏఈవోలతో రైతుల పూర్తి వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయించుకోవాలన్నారు. వేముల్ నర్వ గ్రామంలో 150మంది రైతుల ఫార్మర్ రిజస్ట్రీ నమోదు పూర్తయిందని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతులు విధిగా తమ వివరాలను ఆన్లైన్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.