వికారాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించే పనులపై జిల్లా ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకుగాను చేసిన అంచనాలు, ఎంబీ రికార్డులకు పొంతన లేకపోవడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. అంతేకాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కింద పూర్తి చేసిన పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు లోపించినట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఇతర శాఖలకు సంబంధించిన అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించగా.. వారు నేటి నుంచి స్కూళ్లవారీగా పనులు పరిశీలించనున్నారు.
ఇంకా పలు పాఠశాలల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల వేగవంతంపై పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్ జోక్యం చేసుకొని నిర్లక్ష్యం మానుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద 929 స్కూళ్లను ఎంపిక చేయగా, ఇప్పటివరకు 202 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ‘మన ఊరు-మన బడి’ కింద 12 రకాల మౌలిక వసతులను కల్పించేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదు వసతులు మాత్రమే కల్పిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘మన ఊరు-మన బడి’ స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. కేసీఆర్ సర్కార్ తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయిటింగ్, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్డుల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు తదితర వసతులు అందుబాటులోకి తీసుకురాగా.. ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కేవలం తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులకు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం స్కూళ్లలో కల్పిస్తున్నది.
గతంలో ‘మన ఊరు-మన బడి’లో బడికి ఎంపికై 20-50 శాతం పనులు పూర్తైన స్కూళ్లను కాకుండా.. కొత్త స్కూళ్లను ఎంపిక చేశారు. ఇప్పటికే కొంతమేర పనులు పూర్తైన స్కూళ్లలోనే పనులు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమయినప్పటికీ పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ‘మన ఊరు-మన బడి’ స్కూళ్లలోని అసంపూర్తి పనులను పూర్తి చేయడం లేదని సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. గత ఆరు నెలలుగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా.. ఇప్పటికీ పెండింగ్లో ఉన్న బిల్లులకు నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. స్కూల్ కమిటీలు, సంబంధిత అధికారులపై ఒత్తిడితో పలు స్కూళ్లలో పనులు పూర్తి చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పనులు పూర్తి చేసిన వారిలో చాలావరకు స్కూల్ కమిటీ సభ్యులే ఉన్నారు. వారు అప్పులు చేసి పనులు పూర్తి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మన ఊరు-మన బడిలో పూర్తైన పనులకు సంబంధించి బిల్లులు చేసి ప్రభుత్వానికి అందజేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం సంబంధిత బిల్లుల విషయంలో చేతులెత్తేస్తున్నారు. మరోవైపు పనులు పూర్తై నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి పనులు పూర్తి చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో 371 స్కూళ్లను ‘మన ఊరు-మన బడి’కి ఎంపిక చేయగా, 20 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఇక సుమారు 300 స్కూళ్లలో పనులు 20-50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి రూ.8 కోట్ల చెల్లింపులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది.