వికారాబాద్, మార్చి 7 : గ్రామాల్లో రోజురోజుకూ పచ్చదనం కనుమరుగ వుతున్నది. ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం అందాలనే సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పా టు చేసి వాటి ఆలనాపాలన చూసుకున్నది. దీంతో పచ్చని మొక్కలు, చెట్లతో అందరినీ ఆకట్టుకున్నాయి.
అయితే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పింది. మండలంలోని పులుసుమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో నీరు లేక ఉన్న చెట్లన్నీ ఎండిపోయాయి. గతంలో పంచాయతీ ట్యాంకర్ ద్వారా పల్లె ప్రకృతి వనంలోని ప్రతి మొక్కకూ నీటిని అందించే వారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో నిధుల్లేకపోవడంతో వాటి నిర్వ హణ కొరవడింది. పంచాయతీ ట్రాక్టర్ మరమ్మతులు చేయించకపోవడంతో అది మూలకు చేరింది. ఇకనైనా అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను నీరందించి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.