చేవెళ్ల రూరల్, జూన్ 1 : చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల, తంగడిపల్లి గ్రామాల్లో నకిలీ విత్తనాలు, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, రైతులు విత్తనాల కొనుగోలులో మోసపోవద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

కడ్తాల్ : నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీలత హెచ్చరించారు. శనివారం మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని విత్తనాలు, ఎరువుల నిల్వలతోపాటు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. రైతులకు విత్తనాలు విక్రయించినప్పుడు తప్పనిసరిగా రశీదులు అందజేయాలని సూచించారు. ఈ-పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలని, నకిలీ విత్తనాలను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వానకాలంలో పంటల సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. షాపుల్లో ధరల పట్టిక, ఎరువుల నిల్వలను సూచించే బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏఈవో వందన, సిబ్బంది పాల్గొన్నారు.
మొయినాబాద్ : రైతులు విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాగమ్మ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు దుకాణాలను ఆర్ఐ చంద్రమోహన్‌తో కలిసి తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాల ప్యాకెట్లు, మందు డబ్బాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు అమ్మిన డీలర్లు తప్పనిసరిగా రైతులకు బిల్లులు ఇవ్వాలని పేర్కొన్నారు. బిల్లులు, విత్తనాల ప్యాకెట్లను పంట చేతికి వచ్చే వరకు భద్రపరచాలని రైతులకు సూచించారు. లూజుగా ఉన్న విత్తనాలు కొనుగోలు చేయరాదన్నారు. డీలర్ షాపుల్లో లైసెన్స్ పేరుతో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆమె రైతులకు సూచించారు.

ఆమనగల్లు : అధీకృత ఫెర్టిలైజర్ డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని పలు అధీకృత డీలర్ దుకాణాలను మల్టీ డిసిప్లినరీ టీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రికార్డులు, విత్తనాలు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఏవో మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. దుకాణాల ఎదుట స్టాక్ వివరాలు, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని అమె సూచించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని షాప్ నిర్వాహకులకు ఏవో సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వినోద్, హెడ్ కానిస్టేబుల్ శివ కుమార్ పాల్గొన్నారు.
షాబాద్ : అధిక ధరలకు విత్తనాలు అమ్మితే డీలర్లపై చర్యలు తప్పవని షాబాద్ మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం అన్నారు. శనివారం షాబాద్‌లోని వివిధ ఫెర్టిలైజర్ దుకాణాలను డిప్యూటీ తహసీల్దార్ మధు, ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం దుకాణాల్లో ఎరువులు, విత్తనాల స్టాకు నిల్వలు, స్టాకు రిజిస్టర్లు, బిల్లు బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు విత్తనాల కొరత రాకుండా తగినన్ని నిల్వలు పెట్టాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలన్నారు. కార్యక్రమంలో డీలర్లు రాజేందర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, భీమ్సేనారెడ్డి ఉన్నారు.