సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్న అంబులెన్స్ వేగంగా దవాఖానకు చేరేందుకు ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ లైట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ముందస్తుగా అంబులెన్స్ ఫలానా చోట నుంచి ఫలానా చోటకు వెళ్తుందనే సమాచారం ట్రాఫిక్ కంట్రోల్‌కు ఇవ్వాలని, దీంతో ఆ రూట్లో వెళ్లే అంబులెన్స్‌కు ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. సిగ్నళ్ల వద్ద ఆగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు. అంబులెన్స్‌లను దుర్వినియోగం చేస్తే ఆయా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే ప్రతి అంబులెన్స్ అత్యవసరమనుకుంటే పొరపాటే..
ప్రతి వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ట్రాఫిక్ పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు.. అంబులెన్స్ అసోసియేషన్, దవాఖాన యాజమాన్యం, డయాగ్నోస్టిక్ కేంద్రాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆటోమెటిక్‌గా పనిచేస్తున్నాయి. వీఐపీ మూవ్మెంట్, అత్యవసర పరిస్థితుల్లో సిగ్నల్స్‌ను మ్యాన్వల్గా మారుస్తుంటారు. అంబులెన్స్‌లకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చే క్రమంలో కూడా మ్యాన్వల్గా మారుస్తారు. ప్రతిరోజు నగరంలో 1000 నుంచి 1500 వరకు అంబులెన్స్‌లు ఆయా సిగ్నల్స్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.
కొన్ని అంబులెన్స్‌లు దవాఖాన నుంచి రోగి వద్దకు, రోగిని తీసుకొని తిరిగి దవాఖానకు వెళ్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రికి సంబంధించిన పనులకు కూడా కొందరు అంబులెన్స్ వాడుతున్నారు. ఇందులో అత్యవసరం ఏదీ..! అత్యవసరం కానిదేదీ..! అనేది అంబులెన్స్ నిర్వాహకులు తెలుసుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే.. ట్రాఫిక్ కంట్రోల్ రూం (8712 660600)కు సమాచారమివ్వాలి. ఆ సమాచారం కంట్రోల్ రూమ్ నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి చేరుతోంది. దీంతో ఒక సిగ్నల్ నుంచి మరో సిగ్నల్‌కు అంబులెన్స్ చేరుకునే వరకు గ్రీన్ సిగ్నల్ వచ్చే విధంగా ట్రాఫిక్ సిబ్బంది చర్యలు తీసుకుంటారు.
అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కొందరు అంబులెన్స్‌లో పేషెంట్స్ లేకున్నా.. అత్యవసరం కాకున్నా సైరన్ల మోత మోగిస్తున్నారు. సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బందులొస్తున్నాయి. అంబులెన్స్ వాహనాలు నిబంధనల మేరకు నడువాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అంబులెన్స్‌లకు వేగంగా సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దుర్వినియోగం చేయవద్దంటూ అంబులెన్స్ అసోసియేషన్లు, దవాఖానల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముందస్తుగా దవాఖానలు, అంబులెన్స్ సర్వీస్‌ల నుంచి సమాచారం అందిస్తే ఆయా రూట్లు క్లియర్ చేస్తాం. ఇందుకు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (8712 660600)కు ఫోన్ చేయాలి. ఏదైనా సందేహముంటే హెల్ప్ లైన్(9010203626)కు ఫోన్ చేయాలి. అంబులెన్స్‌లను దుర్వినియోగం చేస్తే సీజ్ చేస్తాం.