POCSO | చేవెళ్ల రూరల్, మార్చి 4 : మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి రంగారెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.5లక్సలు చెల్లించాలని ఆదేశించింది.
మోకిలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని ఇర్రుకుంట తండాకు చెందిన విశ్లావత్ రాము 2019లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు విన్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. అలాగే బాధితురాలికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే అదనంగా జైలు శిక్ష విధిస్తామని తెలిపింది.