పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 29: కొత్త అపార్టుమెంట్లో మీటర్లకు సర్వీస్ నంబర్ల కోసం డబ్బులు డిమాండ్ చేసిన విద్యుత్‌శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. పెద్దఅంబర్‌పేట లైన్ఇన్స్పెక్టర్, ఏఈ (ఆపరేషన్స్) ప్రభులాల్ రూ.6 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీ పరిధి, తట్టిఅన్నారం జ్యోతిపురం కాలనీలోని ఓ కొత్త అపార్టుమెంట్లో లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్.. 63 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు కొత్త మీటర్లు బిగించి.. సర్వీస్ నంబర్లు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.6 వేలు ఇస్తేనే సర్వీస్ నంబర్లు ఇస్తామని చెప్పాడు. దీంతో భవన యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల సూచనలతో భవన యజమాని బుధవారం రూ.6 వేలు లంచం డబ్బులను బండ్లగూడ సమీపంలోని తాజా హోటల్లో ప్రభులాల్ చేతిలో పెట్టగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రభులాల్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.