కులకచర్ల, నవంబర్ 2 : కుటుంబ కలహాలతో ఓ యువకుడు కుటుంబ సభ్యులను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కులకచర్ల గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య(38) ఇంట్లో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దల వద్ద పంచాయితీ నిర్వహించినా తగ్గడంలేదు. యాదయ్యకు పాలమూరు జిల్లా హనువాడ మండలంలోని పగిడ్యాల్ గ్రామానికి చెందిన అలివేలు(34)తో 15 ఏండ్ల కిందట వివాహం జరిగింది. వారికి అపర్ణ, శ్రావణి అనే కుమార్తెలున్నారు. ఈ దంపతులు తరచూ గొడవపడేవారు. యాదయ్య భార్యపై అనుమానపడేవాడు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. పెద్దలు సర్దుకుపోవాలని సూచించారు. ఠాణా వరకు వెళ్లినా వారిలో మార్పు రాలేదు.
గొడవల కారణంగా అలివేలు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని బలభద్రపల్లి గ్రామంలోని అక్క హన్మమ్మ దగ్గర ఉండేది. దాంతో యాదయ్య తన వదిన హన్మమ్మ కారణంగానే తమ మధ్య గొడవలు జరుగుతున్నట్లు భావించి.. దానిని మనసులో పెట్టుకున్నాడు. రెండు రోజుల కిందట కూడా ఆ దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. స్థానిక పెద్దల వద్దకెళ్లగా ఇరువురు సర్దుకుపోవాలని సూచించారు. దీంతో తన భార్య, వదినపై పగ పెంచుకున్న అతడు.. ముందుగానే కత్తి తయారు చేయించుకుని శనివారం వారిని హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు.

తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దాలని భావించిన అక్క హన్మమ్మ తన చెల్లి ఇంటికొచ్చి యాదయ్యకు సర్ది చెప్పేందుకు యత్నించింది. శనివారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన అలివేలు, తన అక్క, పిల్లలు నిద్రిస్తుండగా.. పక్క రూములో యాదయ్య నిద్రిస్తున్నట్లు నటించి వారు నిద్రలోకి జారుకోగానే.. ముందుగా తన వదిన హన్మమ్మ(40)ని చంపాడు. ఆ శబ్దానికి భార్య అలివేలు(34) నిద్ర నుంచి లేచింది. ఇరువురి మధ్య పెనుగులాట జరిగినా ఆమెనూ కత్తితో నరికాడు.
అనంతరం చిన్న కూతురు శ్రావణి(10) మమ్మల్ని ఏమీ చేయకు నాన్న అని వెళ్లగా.. మీరిద్దరు ఉండి ఏమి చేస్తారని భావించి.. చిన్న కుమార్తెను కత్తితో పొడిచి చంపాడు. పెద్ద కుమార్తెనూ కత్తితో రెండు పోట్లు వేయగా అక్కడి నుంచి ఆమె చాకచక్యంగా బయటికెళ్లి ప్రాణాలను కాపాడుకున్నది. వెంటనే ఈ విషయాన్ని పక్కనే ఉన్న వారి బంధువు ప్రభు దగ్గరకు వెళ్లి చెప్పింది. వారిద్దరు కలిసి ఇంట్లోకెళ్లి చూడగా అక్కడే ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు యాదయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ప్రభు 100కు సమాచారమందించగా పోలీసులు చేరుకున్నారు. ముగ్గురు హత్య చేయబడి ఉండగా.. యాదయ్య ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నారు.
కులకచర్ల ఎస్ఐ విచారణ నిర్వహించి ఈ విషయాన్ని ఎస్పీ, డీఎస్పీకి సమాచారమందించారు. మృతురాలి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్‌కుమార్ తెలిపారు. పెద్ద కుమార్తె అపర్ణకు పరిగి ఆస్పత్రిలో చికిత్స చేశారు. అలివేలు, హన్మమ్మ, శ్రావణి, యాదయ్యల మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం పరిగి మార్చురీకి పోలీసులు తరలించారు. కాగా ఘటనాస్థలికి పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఆదివారం ఉదయం చేరుకుని మృతదేహాలను పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
కళ్లముందే కత్తితో నరికి చంపాడు
– అపర్ణ, పెద్ద కూతురు
చూస్తుండగానే తన పెద్దమ్మ, తన తల్లి, చెల్లిని నాన్న కత్తితో నరికి చంపాడు. నాపైనా దాడి చేయడంతో నేను అక్కడి నుంచి తప్పించుకుని బయటికొచ్చా. కొంతకాలంగా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.