Software Engineer | కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 5 : రోడ్డుపై దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. కేపీహెచ్‌బీ కాలనీ ఎస్సై లింగం తెలిపిన విరాల ప్రకారం.. నగరంలోని హైదర్ నగర్ హెచ్ఎంటీ హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న భూమ విజయ్ కుమార్ (32) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తను రోడ్డుపై వెళ్తుండగా ఓ పర్సు కనిపించడంతో… ఆ పర్సును తీసుకొని నిజాయితీతో స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.
కాగా పోలీసులు… ఆ పర్సులోని ఆధార్ కార్డు ఆధారంగా… కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన భూమల ప్రజ్వల్ గౌడ్‌గా తేల్చారు. ఫోన్ నెంబర్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే కామారెడ్డిలోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారాన్ని అందించి అతని వివరాలను సేకరించారు. పర్సు పోగొట్టుకున్న వ్యక్తి నగర శివారులోని మేడ్చల్‌లో నివాసమంటూ… ర్యాపిడో బైక్ నడుపుతూ జీవిస్తున్నాడు. ఫోన్ ద్వారా ప్రజ్వల్ గౌడ్‌కు సమాచారాన్ని అందించి… పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పొడగొట్టుకున్న పర్సును అతడికి ఎస్సై లింగం అందజేశాడు. ఆ పర్సులో 800 రూపాయల నగదుతో పాటు ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డులు ఉన్నాయి. నిజాయితీతో పర్సును అప్పగించిన విజయ్ కుమార్‌ను కేపీహెచ్‌బీ కాలనీ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ లింగంలు ప్రత్యేకంగా అభినందించారు.