కడ్తాల్, మే 1 : రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయిన ఓ వ్యక్తికి కుటుంబ పోషణ భారంగా మారింది. కుటుంబ పెద్ద ఇంటి వద్దనే ఉంటుండటంతో ఇల్లు గడవడం కష్టతరమైంది. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన ఎర్గమోని రమేశ్ ముదిరాజ్ మహేశ్వరం మండలం తుక్కుగూడలోని ఓ రైస్ మిల్లులో ఆపరేటర్‌గా పని చేసేవాడు. 2018 జనవరి 1న సాయంత్రం రైసు మిల్లులో పనులు ముగించుకోని బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా, మార్గమధ్యలో తుమ్మలూరు గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దవఖానలో చికిత్స పొందిన రమేశ్ తన కాలును కోల్పోగా చేతికి తీవ్ర గాయమైంది.
అప్పటి నుండి రమేశ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. వైద్యానికి రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయిన్నట్లు రమేశ్ తెలిపాడు. ప్రభుత్వం అందించే రూ.4 వేల పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు. భార్య రజిత చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడి కుమారులు మనోహర్, ప్రణీత్ 3, 2 తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. దాతలు ముందుకు వచ్చి తనను ఆదుకోవాలని రమేశ్ ప్రాధేయపడుతున్నాడు. ఆర్థిక సాయం అందించే వారు 88979 42298 నెంబర్‌కి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అందించాలని బాధితుడు వేడుకుంటున్నాడు.