Heart Attack | పెద్దేముల్, ఏప్రిల్ 19 : ఉపాధి కూలీ పనులు చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన పెద్దేముల్ మండల పరిధిలోని దుర్గాపూర్ గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.
దూర్గాపూర్ గ్రామానికి చెందిన వడ్డెపెద్ద అమృతయ్య శనివారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనుల్లో నిమగ్నమైన తర్వాత ఉన్నట్టుండి ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని తోటి కూలీలకు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన అమృతయ్య రెండో భార్య, తోటి కూలీలు కలిసి తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ డాక్టర్లు అమృతయ్యను పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో దుగ్గాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వడ్డెపెద్ద అమృతయ్యకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అమృతయ్య చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఉపాధి హమీ టిఏ శ్రావణ్, ఎఫ్ఎ వెంకటయ్యతో కలిసి అమృతయ్య కుటుంబాన్ని పరామర్శించారు.