Pandavula Banda | కులకచర్ల, డిసెంబర్ 14 : ప్రకృతి అందాలను మైమరిపించే పాండవుల బండ వివిధ ప్రాంతాల పర్యాటకులను తన అందాలతో మురిపిస్తున్నది. ఎత్తైన కొండలు, జాలువారే సెలయేరు, పక్కనే ఎప్పుడు నిండు కుండలా కనబడుతున్న చెరువు, కండ్లకు కట్టినట్లుగా కనిపించే ప్రకృతి అందాలు పలువురిని ముగ్దులను చేస్తున్నది. శీతాకాలంలో అడవుల్లో సీతాఫలాలను తీసుకువెళ్లే వారికి ప్రకృతి అందాలు మైమరిపిస్తున్నది. ప్రకృతి అందాలను కళ్లకు వింపుగా కనిపించే ఈ అందాలు కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలో పర్యాటకులను అలరిస్తున్నాయి. పాండవుల గుట్ట అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి.
మండల కేంద్రానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పాండవులగుట్టలు ఉన్నాయి. పాండవుల గుట్ట ప్రాంతానికి వెళ్తే పచ్చనిచెట్లు జాలువారుతున్న జలపాతాలు కనులకు వింపుగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాన్నే పండుగల సాయన్న గుట్ట అని పిలుస్తారు. అక్కడే ఒక గుండు వుంది అదే పండుగల సాయన్న గుండు, గద్ద గుండు, గుండు మీద గుండు, నిండుగా పారుతున్న కుంట చూపరుల కంటికి కనబడతాయి. ఇవన్నీ ప్రకృతికి నిలయాలుగా మారుతున్నాయి. ఈ ప్రదేశం చారిత్రాత్మక ప్రదేశాలను తలపిస్తున్నది. విద్యార్థులకు సెలవుల్లో పాండవులగుట్ట విహారయాత్రగా మారింది.
ద్వాపరయుగంలో జూదంలో ఓడిన పాండవులు వనవాసం చేస్తారు, పాండవులు వనవాసం చేస్తూ ఒక రోజు ఈ గుట్ట వద్ద నిద్రించారని, అందువల్లే ఈ గుట్టకు పాండవుల గుట్టగా పేరుగాంచినదని గ్రామ పెద్దలు చెబుతుంటారు. రాత్రి నిద్రించి అక్కడే భజనలు చేశారని చెబుతున్నారు. దీనికిగాను ఆ ప్రాంతంలో ఓ కొలను ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

ఈ నీటి కుంట ఊటనీటిచే ఏర్పడిందని కుంటలో ఎండాకాలం సైతం నీరు నిండుగా ఉంటుంది. చుట్టు పక్కలపొలాల వారు ఇక్కడికి వచ్చి నీరుతాగి వెళుతుంటారు. కుంట నీటిచే ఎప్పుడూ వరి పంటను పండిస్తుంటారు. బండపై నుంచి నీరు జాలువారుతూ చూడటానికి అందంగా కనిపిస్తుంది. కులకచర్ల నుంచి తిర్మలాపూర్ మీదుగా అడవివెంకటాపూర్ గ్రామానికి వెళ్లే దారిలోనే పాండవులగుట్ట ఉంది.
రజాకార్ల హయాంలో ధనిక వర్గాలను గడగడ లాడించిన వ్యక్తి పండుగల సాయన్న.. ఆయన ధనికులను దోసి పేద ప్రజలకు పంచి పెట్టాడని చెబుతుంటారు. పండుగల సాయన్న ఈ ప్రాంతంలో పర్యటించాడని తెలియజేస్తుంటారు. పేదప్రజలకు అండగా నిలిచిన ధీరుడు పండుగల సాయన్న పేదప్రజల పక్షాన నిలిచారు. ధనికుల నుంచి దోచుకొని పేదలకు పెట్టే క్రమంలో పాండవులగుట్టపైన ఒక గుండు ఉంది ఆ గుండు పైనుంచి పండుగలసాయన్న తన కార్యకలాపాలను కొనసాగించారని చెబుతుంటారు. రజాకార్లను ఓ ఊపు ఊపిన అతడి వీరత్వం గురించి మండల ప్రజలు చెబుతుంటారు.
రాత్రివేళల్లో దోచుకోవడానికి వెళ్లే ముందు ఈ గుండుపైన దీపం పెట్టి వెళ్లేవాడని గుండుపై పెట్టిన దీపం.. చుట్టూ 15 కిలోమీటర్ల దూరం వరకు కనిపించేదట. పండుగలసాయన్న ఎంతదూరం వెళ్లిన కనిపించే దీపం ఆధారంగా తిరిగి ఆ గుండుపైకి వచ్చే వాడట ఇప్పటికీ ఆ గుండును పండుగల సాయన్న గుండుగా పిలుస్తుంటారు. పండుగల సాయన్న దోచుకున్న ధనాన్ని ఈ గుట్టల ప్రాంతంలో దాచి పెట్టాడని ఇప్పటికీ అక్కడడక్కడ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. అందువల్లనే ఈ గుండుకు పండుగల సాయన్న గుండు అంటారు.
పైకి వెళ్లడానికి సాధ్యం కాని గద్దగుండు పాండవుల గుట్ట పైనే మనకు కనబడుతుంది. పాండవుల గుట్టకు ఎడమవైపు భాగాన ఉన్న గుట్టపై గద్ద గుండు కనగబడుతుంది. ఈ గుండుపైకి ఎక్కాలని ఎంతోమంది ప్రయత్నించినా ఇప్పటికీ సాధ్యం కాలేదు. గద్దలు ఈ గుండుపై గుంపులు గుంపులుగా ఉండేవని ఈ గుండుపై నుంచే చుట్టు పక్కల గ్రామాలను పసిగట్టేవని పెద్దలు చెబుతుంటారు. గద్ద గుండు నుంచీ పోచమ్మదారి కనబడుతుంది.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఇప్పటికీ పాండవుల గుట్టపైకి వచ్చి వనభోజనాలు చేసి వెళుతుంటారు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో చుట్టు పక్కల ప్రాంతాల్లోని విద్యార్థులు వనభోజనానికి వెళ్లి చెట్ల నుంచి సీతాఫలాలు సేకరిస్తూ ఉల్లాసంగా తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, కేరింతలు కొడుతూ బహు ఉషారుగా ప్రకృతిని ఆస్వాదిస్తూ వనభోజనాన్ని ముగిస్తారు. ప్రకృతికి నిలయాలైన ఈ అందాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది.
పాండవులగుట్టకు వెళ్లేదారిలో వేంకటేశ్వరస్వామి గుట్ట ఉన్నది. రజాకర్ల హయాంలో ఈ గుట్టపైన వున్న వేంకటేశ్వరస్వామి గుడిలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారని పెద్దలు చెబుతున్నారు. ఇప్నటికీ భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేస్తుంటారు. ఇక్కడ స్వామీజీకి ఇప్పటికీ మాంసంతోనే నైవేద్యం పెడుతుంటారు. మేకలు, గొర్రెలు, కోళ్లను బలిచ్చి పూజలు చేస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా పాండవుల కొండను చూసివెళుతుంటారు. ప్రకృతి అందాలైన పాండవుల కొండలను ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైన ఉన్నది.
పాండవుల గుట్ట ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ప్రకృతిలో ఆహ్లాదాన్ని నింపే ఈ గుట్ట పలువురిని ముగ్దులను చేస్తున్నది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయాలి. చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గుట్ట ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించి ఇంకా అభివృద్ధి చేస్తే చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పర్యాటక ప్రదేశంగా ఉంటుంది.
– గుండుమల్ల నర్సింహులు, తిర్మలాపూర్ కులకచర్ల మండలం
కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామ పరిధిలోని పాండవుల గుట్ట ప్రాంతం పచ్చగా ఉంటూ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. కొండపైన కొంతసేపైన విహరించాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తున్నది. పాండవులు నడయాడిన గుట్ట కావున పాండవుల బండగా పిలువబడుతున్నది. శీతాకాలంలో సీతాఫలాల కోసం చాలామంది వచ్చి కొంతసమయాన్ని గడిపివెళుతారు. మండల పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు కూడా పిక్నిక్వచ్చి వెళుతుంటారు. ప్రకృతిలో కాస్త సమయాన్ని గడపడం వలన ప్రశాంతత లభిస్తుంది.
– రాములు, తిర్మలాపూర్