కడ్తాల్, జూలై 17 : రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మండల కేంద్రం సమీపంలో సమగ్ర శిక్ష నిధులు రూ.3.35 కోట్లతో నిర్మించిన కస్తూర్బాగాంధీ విద్యాలయ నూతన భవనాన్ని బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, డీఈవో సుశీందర్‌రావు, ఏంఈవో సర్దార్నాయక్తో కలిసి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెర్కూర్ గ్రామం వద్ద వంద ఎకరాల్లో త్వరలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, వంగూర్ మండలం సర్వారెడ్డిపల్లి గ్రామంలో వెయ్యి ఎకరాల్లో రూ.800 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
వనపర్తి జిల్లాలో ఐటీ టవర్స్‌తోపాటు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఓఎల్ఈడీ పరిశ్రమ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గురువారం నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన డబ్బులను జమ చేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన, జూనియర్ కళాశాల, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ, మంత్రులకు పలువురు నాయకులు వినతిపత్రాలను అందజేశారు. అంతకుముందు వన మహోత్సవ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలను నాటారు.
చెంచులకు బోరుమోటర్లు పంపిణీ..
మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ పంచాయతీలో గల జమ్ములబావి తండాలోని 26 చెంచు కుటుంబాలకు, బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి బోరుమోటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్, మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ, బీచ్చానాయక్, నాయకులు భాస్కర్‌రెడ్డి, మోత్యానాయక్, హన్మానాయక్, చందోజీ, వేణుగోపాల్, జహంగీర్‌అలీ, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నరేశ్‌నాయక్, శంకర్, శేఖర్‌గౌడ్, రాములుగౌడ్, రాజేశ్, బాలరాజు, మల్లేశ్‌గౌడ్, శేఖర్, యాదయ్య, రాజేందర్‌గౌడ్, భానుకిరణ్, ఏసీపీ రంగస్వామి, డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, డీటీడీవో రామేశ్వరీదేవి, ఏటీడీవో వెంకటయ్య, సీఐ శివప్రసాద్, తహసీల్దార్ ముంతాజ్, ఎంపీడీవో సుజాత, ఏంఎన్వో జంగయ్య, ఎస్ఓ అనిత పాల్గొన్నారు.