అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా పరిగణిస్తున్నది. బోగస్ కారణంగా రేషన్ బియ్యం సహా ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హులకే అందేలా ప్రభుత్వం ఈకేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)ని తప్పనిసరి చేసింది. ఈకేవైసీ చేయించిన వారికి మాత్రమే రేషన్ సరుకులు అందనున్నాయి.
ఈ ప్రక్రియను చేయించుకోనివారి పేర్లను సైతం రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ ఇంకా వంద శాతం పూర్తి కాలేదు. రంగారెడ్డి జిల్లాలో ఈకేవైసీని ఇప్పటివరకు 99 శాతం మంది చేయించుకున్నారు. ఈకేవైసీ పూర్తికి సెప్టెంబర్ 30 వరకు గడువును ప్రభుత్వం పొడిగించింది.
– రంగారెడ్డి, జూన్ 16 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలో వివిధ రేషన్ కార్డులు 5,58,410 ఉన్నాయి. వీటిలో 18,22,532 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా సివిల్ సప్లయ్ శాఖ 11,559.197మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను కేటాయిస్తూ వస్తున్నది. ఒక్కో వ్యక్తి పేరిట ఆరు కిలోల చొప్పున రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వం నెలనెలా బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నది. స్థానికంగా లేనివారు, చనిపోయిన వారు, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పేరిట ప్రతి నెలా బియ్యం పంపిణీ జరుగుతున్నది.
ఈ అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్, ఐరీస్ విధానాలను అమలు చేస్తున్నప్పటికీ బోగస్ లబ్ధిదారులను గుర్తించడం కష్టంగా మారింది. దీనికి ప్రధాన కారణం రేషన్ కార్డుల్లోని ఎవరైనా సభ్యుడు ఒకరు డీలర్ వద్దకు వెల్లి వేలిముద్ర వేస్తే సభ్యులందరికీ బియ్యం పంపిణీ జరుగుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని అనర్హులు సైతం బియ్యం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలా.. రేషన్ దుకాణాల్లో పొందిన బియ్యాన్ని ప్రైవేటు దళారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ప్రతి నెలా వేలాది క్వింటాళ్ల బియ్యం దుర్వినియోగమవుతున్నది.
రేషన్ కార్డుదారులు ఈకేవైసీని చేయించుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. లేకపోతే వారి కోటా బియ్యం రద్దవుతుందని చెప్పడంతో చాలా మంది ఉరుకులు పరుగులు పెట్టి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియ చివరి దశకు చేరింది. చలామణిలో ఉన్న రేషన్ కార్డుల్లోని 18,22,532 మంది సభ్యులకు గాను గత ఫిబ్రవరి గడువు నాటికి 1,45,088 మంది(92.04 శాతం) ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.
మార్చి వరకు మరోసారి గడువు పెంచడంతో అప్పటివరకు 97 శాతం మంది ఈకేవైసీ చేయించుకున్నారు. ప్రస్తుతం 99 శాతం మంది ఈకేవైసీ చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా ఒక శాతం మంది మిగిలిపోయారు. చిన్నపిల్లలకు సంబంధించి వేలిముద్రలు ఆధార్‌లో అప్‌గ్రేడ్ కాకపోవడం.. కొంతమంది వృద్ధుల వేలిముద్రలను, కంటి పాపలను బయోమెట్రిక్ స్వీకరించకపోవడం వంటి కారణాల వల్ల ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. వీరందరి కేవైసీని సైతం చేయించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది.
బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ పూర్తయిన తర్వాతనే కొత్త కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సివిల్ సప్లయ్ అధికారుల వద్ద కొత్త రేషన్ కార్డుల కోసం 71,226 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం మరో 8,398 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాక.. మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అధికారులు 529 దరఖాస్తులను తిరస్కరించారు.
కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో 24,796 దరఖాస్తులు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఆన్లైన్ చేసి ఉంచారు. ప్రభుత్వం నుంచి మార్గ నిర్దేశాలు వచ్చిన వెంటనే అందుకనుగుణంగా రేషన్ కార్డులను జారీ చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.