కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తూ వస్తున్నది. సబ్బండ వర్ణాలకు హామీలనిచ్చిన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కోత విధిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు దక్కకుండా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రూ.2 లక్షల్లోపు రుణమాఫీ అంటూ అర్హులైన లక్ష మంది రైతులకు అన్యాయం చేసింది. రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను నేటి నుంచి గ్రామ సభల్లో వెల్లడించనున్నారు. ప్రధానంగా రేషన్ కార్డుల జారీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటింటి సర్వే చేసి, ప్రజాపాలనతో పాటు మీసేవ, ఆన్లైన్ ద్వారా జనం దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే వికారాబాద్ జిల్లాలో 23 వేలు, రంగారెడ్డి జిల్లాలో 83 వేల దరఖాస్తులే వచ్చాయని అధికారులు పేర్కొంటుండడం బాధాకరం. అర్హుల పేర్లు రేషన్‌కార్డు జాబితాలో లేకపోవడంతో కోత విధించే ప్రక్రియలో భాగమా అన్నదానిపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా పేర్లు సర్వే జాబితాలో ఎందుకు లేవంటూ అర్హులు అధికారులను నిలదీయడంతో వారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ పత్రికా ప్రకటన విడుదల చేసి దాటవేయడం బాధాకరం. దరఖాస్తు చేసుకున్నవారిలో సగం మందికి ఎగనామం పెట్టేందుకే కోత విధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ప్రచారం జరుగుతున్నది.
– రంగారెడ్డి, జనవరి 20 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. మీసేవ ద్వారా 44,400, కుటుంబ సభ్యులను చేర్చేందుకు 1.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన ద్వారా జిల్లాతో పాటు గ్రేటర్లో ఉన్న ప్రాంతాల నుంచి సుమారు 5.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 83 వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలించి, మిగతా దరఖాస్తులను అటకెక్కించడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంటున్నది.
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి స్థాయిలో జరుగలేదు. కొంత మంది ఇండ్లకు స్టిక్కర్లు కూడా అంటించలేదని ప్రజలు పేర్కొంటున్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తాయా.. రావా.. అని జనం ఆందోళన చెందుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన వివరాల ప్రకారం.. కారు, పెద్ద పెద్ద భవనాలు, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే రేషన్ కార్డులు ఇవ్వొద్దన్న ఆంక్షలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. పథకాల అమలులో కోతలు విధిస్తుండడంతో జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని కొర్రీలు పెట్టి రైతు భరోసాలోనూ కోత విధించాలని చూస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం అర్హులను తగ్గించింది. జిల్లావ్యాప్తంగా 12.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. బీఆర్ఎస్ హయాంలో 6.20 లక్షల ఎకరాల వరకు రూ.300 కోట్లకుపైగా రైతు బంధు సాయాన్ని అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 5.80 లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేందుకు జాబితాను సిద్ధం చేసింది. దీంతో దాదాపు 30 వేల ఎకరాలను తగ్గించి రైతుల ఉసురు పోసుకుంటున్నది. ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.12 వేలే ఇస్తామంటూ మాట మార్చడంతో రేవంత్ సర్కార్‌పై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేస్తున్నది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే జాబితాలో పేరు రాలేదు. మా నాన్నకు ఇద్దరం అన్నదమ్ములం వేర్వేరుగా ఉంటున్నాం. ఇలాంటి పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు బాధగా ఉన్నది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.
– అనిల్, మైల్వార్ గ్రామం, (బషీరాబాద్)
రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతోపాటు ప్రజాపాలనలోనూ దరఖాస్తు చేసినా. దరఖాస్తులో భార్య, పిల్లల పేర్లు చేర్చాలని కోరినా. రేషన్ కార్డుల లిస్టులో పేరు రాలేదు. అధికారుల అర్హులుగా ఉన్న మమ్మల్ని ఎంపిక చేయకపోవడం బాధగా ఉన్నది.
– యూ అశోక్, దేవనోనిగూడెం గ్రామం, పూడూరు
ఎన్నికలకు ముందు అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి మరిచారు. రేషన్‌కార్డు ప్రజాపాలన, కుటుంబ సర్వేలో దరఖాస్తు చేసుకుంటే పేరు రాలేదు. మాకు సెంటు భూమి కూడా లేదు. హైదరాబాద్‌కు వెళ్లి కూలి పని చేస్తూ బతుకుతున్నం. రేషన్ కార్డు మంజూరు చేయాలి.
– వనిత. గృహిణి, ఆలేడ్, దుద్యాల మండలం (కొడంగల్)
వ్యవసాయ భూమి ఉన్నదని రేషన్ కార్డు కట్ చేశారు. రేషన్ కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా. అయినా అధికారులు స్పందించ లేదు. తమది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ములు భూమి పంపకాలు చేస్తే, తమకు ఐదు ఎకరాల్లోపు వస్తుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– పండరీనాథ్, శ్యామప్ప, ఉద్దండాపూర్, (తాండూరు రూరల్)
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. పథకాల అమలులో మాత్రం కొర్రీలు పెడుతున్నది. రేషన్ కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా. లిస్టులో పేరు రాలేదు. కుటుంబంలో నలుగురం ఉన్నాం. రేషన్ కార్డు మంజూరు చేయాలి..
– బంగారి రమేశ్, రావులపల్లి, మర్పల్లి మండలం
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు పూటకో మాట మాట్లాడుతుండ్రు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కిరికిరి పెడుతుండ్రు. ప్రజాపాలన, కుటుంబ సర్వేలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నం. లిస్టులో పేరు రాలేదు. అధికారులను అడిగితే పొంతనలేని సమాధానం చెబుతుండ్రు.
– రాజు, బషీరాబాద్