ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 1 : కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలను పరిష్కరిస్తామని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో సుశీందర్రావు అన్నారు. గురువారం ఉదయం విద్యార్థినుల ఆందోళనతో ఆయన ఆర్డీవో వెంకటాచారితో కలిసి అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని, చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తెలిపారు.
అదేవిధంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించారు. తాగునీటి సమస్యతో పాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మెనూ ప్రకారం భోజనం అందించేందుకు ప్రత్యేక కమిటీ వేశామని తెలిపారు. పాఠశాలలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాను దగ్గరుండి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో అధ్యాపకుల మధ్య సమన్వయం లేకపోవటంతోనే సమస్య తలెత్తిందని వివరించారు. నీటి సమస్యను పరిష్కరించడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు.
అనంతరం శాశ్వత పరిష్కారం కోసం తాగునీటి బోరును బిగించనున్నట్లు కమిషనర్ యూసుఫ్ తెలిపారు. అనంతరం ఆర్డీవో వెంకటాచారి మాట్లాడుతూ నూతన భవనంలోకి విద్యార్థులను తరలించేందుకు ఎమ్మెల్యే కిషన్రెడ్డి, మంత్రి సబితారెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇకపై సమన్వయంతో పనిచేయని అధ్యాపకులను ఇక్కడి నుంచి బదిలీ చేయించాలని డీఈవోను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, ఏసీపీ ఉమామహేశ్వర్రావు, ఎంపీపీ కృపేశ్, కౌన్సిలర్లు బర్తాకి జగన్, బానుబాబు, టీఆర్ఎస్ నాయకులు తాళ్ల మహేశ్, మడుపు వేణుగోపాల్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.