యాచారం: మతిస్థిమితం లేని వృద్ధురాలిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్లో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని నల్లవెల్లి తండాకు చెందిన ఓ వృద్ధురాలు (70) మానసిక వ్యాధితో బాధ పడుతున్నది. కొంత కాలంగా ఆమె మాల్ మార్కెట్లో బిక్షాటన చేస్తూ, స్థానిక ఎస్బీఐ వద్ద ఉంటున్నది. బ్యాంకు పరిసరాల్లో తిరుగుతూ రాత్రిపూట అక్కడే పడుకునేది.
అయితే నల్లగొండ జిల్లా మర్రిగూడకు చెందిన పోలె శ్రీశైలం (25) మాల్లోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 9న అర్ధరాత్రి బ్యాంక్ వద్ద నిద్రిస్తున్న వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, బాధిత మహిళకు ఇటీవల గాయం కావడంతో స్థానికులు, బ్యాంకు సిబ్బంది ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో గతాన్ని గుర్తు తెచ్చుకున్న ఆమె.. డిసెంబర్లో తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా మాల్లోని ఎస్బీఐ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దాని ఆధారంగా నిందితుడు శ్రీశైలంను గుర్తించి, అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని సీఐ నరసింహారావు వెల్లడించారు. అతడిని రిమాండ్కు తరలించామన్నారు.
నాగార్జునసాగర్ రోడ్డు పక్కనే ఇలాంటి ఘటన జరిగినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. పెట్రోలింగ్ వాహనాలు ఏం చేస్తున్నాయని, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. సిబ్బందిపై వేటు వేయనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. రెండు నెలల క్రితం జరిగిన విషయాన్ని పోలీసులు గత నాలుగు రోజులుగా గోప్యంగా ఉంచడం పట్ల స్థానికులు సైతం మండిపడుతున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వీడి తమ విధులను సమర్ధంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.