షాద్‌నగర్‌రూరల్, సెప్టెంబర్ 5 : ఫరూఖ్‌నగర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన రామేశ్వరంలో గల రామలింగేశ్వరస్వామి ఆలయం, ఎలికట్టా భవానీమాత దేవాలయ అభివృద్ధికి మంజూరైన రూ.7కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధికారులకు సూచించారు. మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ చైర్మన్ నరేందర్, దేవాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున్‌తో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో మంగళవారం ఆలయాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తర రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి మంజూరైన రూ.5 కోట్లతో ఆవరణలోని రాజగోపురం వరకు ప్రాకార మండపం, రాజగోపురం పూర్తి చేయడం తదితర పనులు, అంబ భవానీ దేవాలయాభివృద్ధి కోసం మంజూరైన రూ.2 కోట్లతో ఆలయం చుట్టూ రాతితో కాంపౌండ్ నిర్మాణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఆలయాలకు నిధులను మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను సన్మానించారు. సమావేశంలో ఈవో నరేందర్, డీఈ ఓంప్రకాశ్, ఇంజినీర్ వల్లీనాయగం, ఎలికట్ట ఆలయాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కృష్ణయ్య, కిరణ్‌కుమార్ పంతులు, నర్సింహులు పాల్గొన్నారు.
గల్లీల్లోనూ సీసీ రోడ్లు
మున్సిపాలిటీలోని అన్ని కాలనీల్లో గల్లీ గల్లీకి సీసీ రోడ్లను వేయిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని పలు వార్డుల కౌన్సిలర్లు, కాలనీల వాసులతో మాట్లాడి అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనుల ప్రాధాన్యతను బట్టి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని వారికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు జీటీ శ్రీనివాసులు, బీఆర్ఎస్ నాయకులు చెట్ల నర్సింహ, పాలమాకుల చెన్నయ్య, గుడ్డు, భూపాల్‌రెడ్డి, జుట్టు రాజు, మురళీమోహన్, పినమోని గోపాల్, నవీన్ పాల్గొన్నారు.