వికారాబాద్, నవంబర్ 30, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం వరకు 69.79 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 66 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈ ఎన్నికల్లో 3శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో 71.1శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా వికారాబాద్ నియోజకవర్గంలో 68.1 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో 70.5 శాతం పోలింగ్ నమోదుకాగా, పరిగి నియోజకవర్గంలో 69.34 శాతం పోలింగ్ నమోదైంది.
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభంకాగా, ఓటర్లు ఉదయం నుంచే జిల్లా అంతటా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటేశారు. ముఖ్యంగా ధారూరు, బొంరాసుపేట, కొడంగల్ మండలాల్లోని గిరిజన తండాల్లోని మహిళలు, యువత క్యూలైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాసుపేట్ మండలం తుంకిమెట్లలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యమైంది, దీంతో మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో 144 సెక్షన్ను అమలు చేసి పోలీసు భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడవనున్నాయి.
జిల్లాలో 2018 ఎన్నికలతో పోలిస్తే వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలోని తండాలు, చిన్న గ్రామ పంచాయతీల్లో ఉదయం 11 గంటల వరకు 70 శాతంమేర పోలింగ్ ముగిసిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే… వికారాబాద్ 10.2 శాతం, కొడంగల్ 8.25, పరిగి 8, తాండూరు 5.1 శాతం పోలింగ్ నమోదైంది. తదనంతరం ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్లయితే జిల్లావ్యాప్తంగా 20.94 శాతం పోలింగ్ నమోదుకాగా, వికారాబాద్ నియోజకవర్గంలో 21.3, పరిగి 22.04, తాండూరు 19.82, కొడంగల్ నియోజకవర్గంలో 20.5 శాతం పోలింగ్ నమోదైంది.
ఒంటి గంట వరకు జిల్లావ్యాప్తంగా 44.85 శాతం పోలింగ్ నమోదుకాగా, పరిగిలో 46.19, వికారాబాద్ 48.9, తాండూరు 41.1, కొడంగల్ 43.2 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలో 57.62 శాతం పోలింగ్ నమోదైంది. పరిగి 58.65, తాండూరు 53.1, కొడంగల్ 61.4, వికారాబాద్ 57.2 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 69.79 శాతం పోలింగ్ నమోదుకాగా, పరిగి 69.34, వికారాబాద్ 68.1, తాండూరు 71.2, కొడంగల్ 70.5 శాతం పోలింగ్ నమోదైంది. వికారాబాద్, పరిగి, కొడంగల్ తాండూరు నియోజకవర్గాల్లో మొత్తం 9,60,376 మంది ఓటర్లుండగా, పురుషులు 4,77,528 మంది, మహిళలు 4,82,808 మంది ఓటర్లు, ఇతరులు 40 మంది ఓటర్లు ఉన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని రేగడిమైలారం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుమణిగింది. వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ పట్టణంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది, బీఆర్ఎస్ యువజన నాయకుడిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో వివాదం తలెత్తింది, అయితే పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.