రంగారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) ; రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యల పరిష్కారంలో ఎడతెరగని జాప్యం నెలకొంటున్నది. ఫలితంగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల వద్ద ఫైల్స్ పేరుకుపోతున్నాయి. వారం, పది రోజుల్లోనే పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఫైల్స్ మాత్రం అనుకున్న మేరలో ముందుకు కదలడం లేదు. రిజెక్ట్ చేస్తూ డ్యాష్ బోర్డ్‌ను క్లియర్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సైతం వాటన్నింటినీ పరిష్కారం కిందనే లెక్క చూపిస్తున్నది. రాష్ట్రంలోనే భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఇప్పటివరకు 1,07,754 దరఖాస్తులను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. కేవలం 3,181 దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం చూపించారు. దీంతో నిత్యం ప్రజలు కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది.
పరిష్కారం అంతంతే..
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి.. ఆచరణలో చేస్తున్నదానికి పొంతన ఉండడం లేదు. భూ సమస్యలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని ఊదరగొడుతున్నప్పటికీ.. నేటికీ చాలావరకు భూ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల వారీగా అధికారాలను విభజించినప్పటికీ భూ సమస్యల పరిష్కారంలో వేగం అందుకోవడం లేదు. మ్యుటేషన్, సక్సేషన్, వారసత్వ మార్పిడి వంటి చిన్నచిన్న సమస్యలను సైతం పరిష్కరించలేకపోతున్నారు. తాము ఎప్పుడో రిపోర్టులు పంపామని, అంతా ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉందంటూ తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కరించే స్థాయిలో ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. కొర్రీలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో పనులు వదులుకుని మరీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నిత్యం ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. సమస్యల సత్వర పరిష్కారానికై స్పెషల్ డ్రైవ్ వంటి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులకు పరిష్కారం లభించలేదు. భూ సమస్యలు పరిష్కారం కాక.. పాస్ బుక్కులు రాక ప్రభుత్వ సంబంధిత పథకాలకు దూరం కావాల్సి వస్తున్నదని జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇదేరీతిన కాలయాపన చేస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదని వారు గగ్గోలు పెడుతున్నారు.
అకారణంగా రిజెక్ట్..
పెండింగ్ దరఖాస్తులను తక్కువగా చేసి చూపించాలనే ఉద్దేశంతో అధికారులు డ్యాష్ బోర్డు క్లియర్ చేసే పనిలో పడ్డారు. చాలా వరకు దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నారు. జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి 2,92,985 దరఖాస్తులు రాగా.. వాటిలో 1,39,600 దరఖాస్తులను అధికారులు అప్రూవ్ చేశారు. అయితే వీటిలో తిరస్కరణకు గురైన దరఖాస్తులు 1,07,754 వరకు ఉన్నాయి. నిషేధిత జాబితాలో భూమి ఉన్నదని, టీఎం15 లేదా టీఎం 33 కింద దరఖాస్తు చేసుకోవాలని స్టేటస్‌లో చూపిస్తుండడంతో మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తున్నదని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. పెండింగ్ దరఖాస్తులను రిజెక్ట్ చేస్తూ దరఖాస్తుల సంఖ్యను అధికారులు తగ్గిస్తుండగా.. పరిష్కరించామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటుండం విస్మయం గొలుపుతున్నది. ఆగస్టు 12 నాటికి తహసీల్దార్ లాగిన్‌లో 10,726 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఆర్డీవో లాగిన్‌లో 6,406 దరఖాస్తులు, అడిషనల్ కలెక్టర్ లాగిన్‌లో 7,175 దరఖాస్తులు, కలెక్టర్ లాగిన్‌లో 3,930 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో 28,237 దరఖాస్తులు ఉండగా.. ఇప్పటివరకు 3,181(11.27శాతం) దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం చూపించగలిగారు.