పరిగి, జనవరి 28:‘సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం.. గులాబీ జెండే ఎజెండాగా ముందుకుసాగి ప్రజల మన్ననలు పొందుతాం.. ఇప్పటికే 90శాతం పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో జిల్లా పార్టీకి కంచుకోటగా ఉన్నది.. మరింత కలిసికట్టుగా పనిచేసి పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తాం..’ అని టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. నూతన అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు. జిల్లాలో పార్టీకి పెట్టని కోటలా కార్యకర్తలు ఉన్నారన్నారు. పార్టీ పటిష్టతకోసం పనిచేసి ప్రతి కార్యకర్తను అధిష్ఠానం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. అందులో భాగంగానే ప్రాథమిక సభ్యత్వమున్న కార్యకర్తలకు రూ.2లక్షలు బీమా సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మరింత చేరువవుతామన్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.
జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా బలోపేతం చేస్తామని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో ముందుకు సాగుతామన్నారు. పార్టీకి పెట్టని కోటలా కార్యకర్తలు ఉన్నారని, వారి సహకారంతో అన్ని గ్రామాల్లోకి పార్టీని తీసుకెళ్లి మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నూతన అధ్యక్షుడిగా నియామకమైన సం దర్భంగా శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు.
అభివృద్ధికి పెద్దపీట
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఆయా గ్రామాల సర్పంచ్‌లు పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో ట్రాక్టర్, ట్యాంకర్‌తోపాటు ట్రాలీ, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి, పట్టణాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. ఓవైపు సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధికి సర్కారు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నది.
90 శాతానికి పైగా ఆర్ఎస్ప్రజాప్రతినిధులే..
టీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో రెండు లక్షలకు పైచిలుకు కార్యకర్తలు ఉన్నారు. ప్రతి గ్రామంలో బూత్ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం. పార్టీ ఏర్పాటు చేసిన కమిటీల్లో మహిళలకు అధిక ప్రాధా న్యం ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా వార్డు సభ్యుడు మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు 90శాతానికి పైగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పార్టీకి పెట్టని కోట లాంటివారు. కార్యకర్తలకు త్వరలోనే శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయాలన్నది పార్టీ అధిష్ఠానం ఆలోచనగా ఉన్నది. రాబోయే రోజుల్లో శిక్షణా కార్యక్రమాల ద్వారా పార్టీని గ్రామాల్లోని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేలా అధిష్ఠానం కార్యక్రమాలను రూపొందిస్తుంది. జిల్లాలో యువ ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా సదుపాయాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు.
అందరినీ కలుపుకొని..
జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగు తాం. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల సమన్వయంతో కార్యక్రమాలను చేపట్టి అమలు పరుస్తాం. పార్టీ అధిష్ఠానం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం అయ్యేలా చూస్తాం. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసి, జిల్లాలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ను నిలుపుతాం.
సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంక్షేమ పథకాలకు అత్యధికంగా నిధులను ఖర్చు చేస్తున్న రాష్ట్రం మనది. రైతన్నకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటున్నది. అన్నదాతకు సాగు కష్టాలు ఉండొద్దనే ఉద్దేశంతో ప్రతి ఏడాది రెండు విడుతలుగా ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున రూ.పది వేలను రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. అంతేకాకుండా రైతులు ఏ కారణంగానైనా మృతి చెందితే రూ.5లక్షల బీమాను అందిస్తుంది. వీటితోపాటు వృద్ధ్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రతినెలా ఆసరా కింద రూ.2016 పింఛన్, దివ్యాంగులకు రూ.3016 పింఛన్ అందిస్తున్నది. పేదింటి యువతి పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చి యువతుల వివాహానికి రూ.లక్షా116 అందజేయడం జరుగుతున్నది. అన్ని సంక్షేమ పథకాల్లోనూ అవినీతి, పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందుతున్నది. కొవిడ్ కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించారు. రేషన్ కార్డుపై ఉచితంగా బియ్యం పంపిణీతోపాటు లబ్ధిదారులకు నెలకు రూ.1500 అందించారు. కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న రుణాలు సైతం పారదర్శకంగా లబ్ధ్దిదారుల కు అందుతున్నాయి. ఈ పథకాలే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గం లో 100 మంది దళితులకు దళితబంధు పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.