రంగారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ‘లోన్ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నం… మాతో కలిసి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నోళ్లకు మాఫీ అయింది… మాకెందుకు కాలేదు. మేమేం పాపం జేసినం..’ అని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మూడు సొసైటీల పరిధిలో పంట రుణం మాఫీ కాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత మండలంలోని మూడు పీఏసీఎస్‌ల పరిధిలో అర్హత కలిగి ఉన్నప్పటికీ 278 మంది రైతులకు రుణవిముక్తి కలుగలేదు. ఉమ్మడి కొత్తూరు మండలం నుంచి విడిపోయి నందిగామ కొత్త మండలంగా ఏర్పాటైంది. ఈ మండలం పరిధిలో చేగూరు, నందిగామ, మేక గూడ పీఏసీఎస్‌లు ఉన్నాయి. కొత్తూరు మండలంలోని గ్రామాలు సైతం ఈ మూడు సొసైటీల పరిధిలోనే ఉన్నాయి. ఈ మూడు సొసైటీల పరిధిలోని రైతులకు రుణమాఫీ రంది పట్టుకున్నది.
రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల్లో చాలా మంది అర్హులు ఉన్నప్పటికీ జాబితాలో వారి పేర్లు గల్లంతు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఒట్టిదేనని తేలిపోయింది. ఆయా సంఘాల పరిధిలోని లెక్కలను పరిశీలిస్తే.. నందిగామ పీఏసీఎస్‌లో 44 మంది రైతులు రుణం తీసుకోగా.. మాఫీ కోసం ప్రభుత్వానికి పంపితే కేవలం 18 మందికే రుణమాఫీ అయింది. 26 మందికి కాలేదు. మేకగూడ పీఏసీఎస్ పరిధిలో 380 మంది రైతులకు గాను 241 మందికే రుణమాఫీ అయింది. మిగిలిన 139 మంది పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. చేగూర్ పీఏసీఎస్ పరిధిలో 349 మంది రుణాలు తీసుకుంటే 236 మందికే మాఫీ అయింది. 113 మంది రుణ విముక్తికి నోచుకోలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల నిబంధనలు పెట్టడం వల్లనే రుణమాఫీకి నోచుకోలేకపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్‌వి మాయ మాటలు..
ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు కొర్రీలు పెడుతున్నది. నాకు కడ్తాల్ గ్రామంలో 3.02 ఎకరాల భూమి ఉన్నది. గ్రామంలోని కెనరా బ్యాంక్‌లో 2009 నుంచి పంట రుణం తీసుకుంటున్నా. ఏటా రెన్యూవల్ చేస్తున్నా. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో నా పేరు కనబడలేదు. వ్యవసాయ, బ్యాంక్ అధికారులను అడిగితే టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెబుతూ సమాధానాన్ని దాటవేస్తుండ్రు. బడా రైతులకు రుణామాఫీ అయ్యి.. నా లాంటి సన్నకారు రైతుకు కాకపోతే ఎలా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– ఎల్గమోని రాజుయాదవ్, కడ్తాల్ మండలం
ఎదురుచూపులే మిగులుతున్నయ్..
మాది ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాల గ్రామం. నాకు, నా భార్యకు వేర్వేరుగా భూమి ఉన్నది. గతంలో విడివిడిగా రూ.1,14,500ల బ్యాంకు లోన్ తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నదని సంతోషించాం. కానీ మాకు మాత్రం మాఫీ కాలేదు. రోజూ బ్యాంకు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నం. సరైన సమాధానం చెప్పడం లేదు. ఎన్నికలకు ముందు ఒక మాట.. గద్దెనెక్కినాక ఒక మాట మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. షరతులు పెట్టి రైతులకు ఏం న్యాయం చేస్తున్నట్టు. ఇప్పటికైనా పంట రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేయాలె.
– జవాజి రాములు, మల్లమ్మ, విఠ్యాల గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం
గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి..
నందిగామ సొసైటీలో గత సంవత్సరం రూ.40వేలు క్రాప్ లోన్ తీసుకున్న. మొదటి విడతలోనే మాఫీ అవుతుందనుకున్న. కాకపోవడంతో అధికారులను అడిగితే సమస్య ఏమీ లేదన్నారు. మూడు విడతలు పూర్తయినప్పటికీ మాఫీ కాలేదు. మాఫీ కాక నాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందరికీ మాఫీ చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి.
– రాంబాబు, పీఏసీఎస్ డైరెక్టర్, నందిగామ
లిస్ట్‌లో నా పేరు రాలేదు..
చేగూరు సొసైటీలో రెండేండ్ల కింద రూ.2లక్షలు లోన్ తీసుకున్నా. క్రమం తప్పకుండా మిత్తి కడుతూ వస్తున్న. వేరే చోట భూమి ఉండడంతో మరో రూ.లక్ష లోన్ తీసుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలు మాఫీ చేస్తానంటే సంతోష పడ్డా. రెండు చోట్లా మాఫీ కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– గోవిందు యాదయ్య, నర్సప్పగూడ
మేం రైతులం కాదా ?
నాకు 3.18 ఎకరాల భూమి ఉన్నది. నందిగామ గ్రామీణ వికాస్ బ్యాంకులో గత ఏడాది లక్షన్నర లోన్ తీసుకున్న. నా కొడుకు శ్రీశైలం షాద్‌నగర్ ఎస్బీఐలో లక్షన్నర లోన్ తీసుకున్నడు. మాకు రేషన్ కార్డు ఒక్కటే ఉన్నది. మా ఇద్దరికీ లింకు పెట్టి ఇద్దరి లోన్ మాఫీ చేయలేదు. మేం రైతులం కాదా.. నేను రైతునే.. నా కొడుకు రైతే.. ఇప్పటికైనా రైతులందరికీ పంట రుణాలను మాఫీ చేయాలె.
– జక్కని అంజయ్య, మోత్కులగూడ