శంకర్పల్లి, మే 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి పల్లెల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. దీంతో గ్రామాల్లో యువతకు క్రీడలపై మరింత ఆసక్తి పెరుగుతున్నది. గతంలో పల్లెల్లో యువతకు క్రీడలపై ఆసక్తి ఉన్నా ఆడుకోవడానికి సరైన ఆటస్థలం లేక ఆటలపై దృష్టి సారించేవారు కారు. కానీ ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా ప్రాంగణాలతో యువత మళ్లీ క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా మంది యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడి గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకు రావాలని ప్రభుత్వం గ్రామీణ యువతను దృష్టిలో పెట్టుకుని మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి క్రీడా ప్రాంగణాలను ప్రారంభించింది. శంకర్పల్లి మండలంలోని 26 గ్రామాల్లో 26 క్రీడా ప్రాంగణాలను పూర్తి చేశారు. ఒక్కో క్రీడా ప్రాంగణం నిర్మాణానికి సుమారు రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ప్రభుత్వం వెచ్చించింది. విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో క్రీడా ప్రాంగణాలు క్రీడాకారులతో కళ కళ లాడుతున్నాయి.
క్రీడా ప్రాంగణాలతో యువతకు మేలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పా టు చేసిన క్రీడా ప్రాంగణాలతో యువతకు ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో ఆడుకొవడానికి స్థలం లేక యువత చాలా ఇబ్బందులు పడ్డారు. నేడు ప్రభుత్వం చేసిన ఆలోచనతో మళ్లీ ఆటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. శంకర్పల్లి మండలంలో 26 గ్రామాల్లో 26 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం.
– వెంకయ్య, ఎంపీడీవో, శంకర్పల్లి
క్రీడలపై యువత ఆసక్తి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలతో యువత మళ్లీ గ్రౌండ్ వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత నైపుణ్యాన్ని వెలికి తీసి వారి ప్రతిభను బయటకు తీయడానికే ప్రభుత్వం ఆట స్థలాలను ప్రారంభించింది. గ్రామీణ యువత సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరచాలి. మండల స్థాయి క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకు రావాలి.
– గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ, శంకర్పల్లి
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు అభినందనీయం
నైపుణ్యం ఉన్నా మారుమూల గ్రామాల్లోని యువత ఆడుకోవడానికి సరైన స్థలం లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలతో యువతకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. క్రీడాకారులు వారి నైపుణ్యంతో జాతీయ స్థాయిలో ఆడి వారి ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి వేదిక. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– రాజూనాయక్, మాజీ చైర్మన్, ఏఎంసీ