కేశంపేట, జులై 9 : కేశంపేట మండల పరిధిలోని చౌలపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. 15కు పైగా వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి 25 వరకు గొర్రెలు, గొర్రెపిల్లలను చంపి తిన్నాయి. స్థానికులు, బాధితుని కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలిగపల్లి కృష్ణయ్య గొర్రెల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నాడు. రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలంలో గొర్రెల మందను నిలిపి ఇంటికి వచ్చి భోజన అనంతరం గొర్రెల మంద వద్దకు వచ్చి నిద్రకు ఉపక్రమించాడన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి చూడగా గొర్రెలు మృత్యువాత పడి కనిపించాయని, దీంతో కంగారుపడి పరిశీలించగా గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయని గుర్తించాడన్నారు. మృతి చెందిన గొర్రెల విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం స్పందించి బాధితున్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమీపంలోని కోళ్ల ఫారాల్లో మృతి చెందిన కోళ్లను యజమానులు బ్రిడ్జి సమీపంలో పారవేస్తారని, మృతిచెందిన కోళ్లను తినడం అలవాటు చేసుకున్న కుక్కలు గొర్రెల మంద పై దాడి చేస్తాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.