‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్‌తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట పొలాల దగ్గర జాగారం చేయాల్సి వచ్చేది. సాగునీళ్లు అందక పంటలు పండక ఎంతోమంది రైతులు అప్పులపాలై ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇలా దారుణమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ ప్రభుత్వమే.
స్వరాష్ర్టాన్ని సాధించడమే గాక ముందుచూపుతో ప్రత్యేక చొరవతో 24గంటలూ నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసి వ్యవసాయానికి ఎలాంటి లోటు లేకుండా చూశాడు. ఆయన వచ్చినంకనే కరెంట్ సమస్యలకు పరిష్కారం లభించింది. ఒక వైపు పెట్టుబడి సాయం, రైతుబీమా.. మరోవైపు సరిపడా సాగునీరు, నిరంతర విద్యుత్తు అందించి రైతును రాజు చేశాడు. కేసీఆర్ హయాంలోనే దర్జాగా పంటలు సాగు చేసుకున్నాం’ అంటూ ఉమ్మడి జిల్లా అన్నదాతలు చెబుతున్నారు.
తెలంగాణ రాకముందు కరెంట్ సమస్యలతో అరిగోస పడుతుంటే.. కేసీఆర్ వచ్చినంక అస్తవ్యస్థంగా ఉన్న విద్యుత్తు వ్యవస్థను మెరుగుపర్చి రంది లేకుండా చేశారని చెబుతున్నారు. ఇలా ఒక వ్యవసాయమే కాదు.. అన్ని రంగాలను గాడిన పెట్టి ‘పవర్ఫుల్ తెలంగాణ’గా నిలబెట్టిన కేసీఆర్‌ను.. కాంగ్రెస్ సర్కార్ కావాలనే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో బద్నాం చేస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి కుట్రపూరిత పోకడలు మానుకొని వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తు అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
– న్యూస్ నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), జూన్ 23
గృహ అవసరాలకు కూడా నిరంతరవిద్యుత్తు అందిస్తలేరు. రోజుకు సుమారు ఆరు నుంచి పదిసాైర్లు కరెంట్ కోతలు విధిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందేది. నేడు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. గృహ అవసరాలతో పాటు వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్తు అందించాలి.
-బుగ్గరాములు , ఇబ్రహీంపట్నం
తెలంగాణ రాక ముందు ఏవిధంగా కరెంటు తిప్పలు పడ్డామో మళ్లీ ఇప్పుడు అలాంటి అవస్థలు పడుతున్నాం. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు తీస్తారో తెలియదు. గృహాలకూ కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో ఉక్కబోతతో ఉడికిపోతున్నాం. రాత్రుల్లో కంటిపై కునుకు ఉండడం లేదు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో చిన్నపాటి వర్షం వచ్చినా.. వెంటనే కరెంటు తీస్తున్నారు.
-నవాజోద్దిన్, కొడంగల్
కేసీఆర్ హయాంలోనే వ్యవసాయానికి ఫుల్ కరెంట్ వచ్చింది. పదేండ్ల కింద కాంగ్రెస్ పాలనలో పగలు నాలుగు గంటలు, రాత్రి మూడు గంటలు కరెంట్ వచ్చేది. కేసీఆర్ సార్ సీఎం అయ్యాక కరెంట్ సమస్యలు దూరమయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పాత రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి. పాలకులు కుట్రపూరితమైన రాజకీయాలు మానుకొని, వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ అందించాలి.
– రాములుగౌడ్, రైతు, కడ్తాల్ మండలం
కేసీఆర్ పాలనలోనే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండే. 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలనలో సాగుకు కరెంటు నిరంతరం ఉండేదికాదు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్తును అందించారు. పదేండ్లలో ఎలాంటి ఆటంకాలు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్తు కోతలు మొదలయ్యాయి.
ప్రస్తుత కరెంటు సమస్యలతో సమైక్య రాష్ట్రంలోని పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల నిరంతర ంటు సరఫరా అయ్యేది. మా ఊర్లో ఎక్కువ మంది కూరగాయలు, ఉల్లి పంటలు పండిస్తారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి త్రీఫేజ్ కరెంటు ఉండటంలేదు.
-విజయ్, పంచలింగాల్, మర్పల్లి మండలం
కేసీఆర్ హయాంలో కరెంటు సమస్యలు అంటే ఏంటో రైతులకు తెలిసేది కాదు. అప్పుడు 24 గంటలూ కరెంటు ఉండేది. దీంతో రైతన్న పంటలకు సరిపడా నీళ్లు అందించి వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతుల బాధలు వర్ణనాతీతం. ఆనాటి రోజులను మళ్లీ రైతులు చూసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడుతున్నది. మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడం మానేసి రైతుల శ్రేయస్సు కోసం సరిపడా విద్యుత్తు అందించాలి.
-ముక్తార్, రైతు, ఆలేడ్, కొడంగల్