వికారాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) అభ్యున్నతికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీలకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే కాకుండా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ హయాంలో అమల్లోకి తీసుకొచ్చిన విలేజ్ ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలో వేగవంతమైనది. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గతేడాది 5,932 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు. గతేడాది జిల్లాలో ఎంపిక చేసిన సభ్యుల్లో వందశాతం మేర మహిళలు గ్రామస్థాయిలోని పరిస్థితులకు అనుగుణంగా తమ బిజినెస్‌లను ఏర్పాటు చేసుకున్నారు. వారికి నష్టాలు రాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అవసరమైన రుణాలను బ్యాంకులు, సెర్ప్, స్త్రీనిధి ద్వారా మంజూరు చేస్తున్నారు. కాగా ఈ నెలాఖరులోగా ఎస్‌హెచ్‌జీలను ఎంపిక చేయాలని అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. విలేజ్ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో ఆసక్తి ఉన్న వారిని ముగ్గురు చొప్పున ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి కల్పనలో కొత్త, కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని, ఆర్థిక వనరులను కల్పించి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి సెర్ప్ శ్రీకారం చుట్టింది.
మహిళలను వ్యాపారులుగా మార్చేందుకు..
విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 5,194 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యాపారులుగా మార్చాలని.. వారికి రూ.103 కోట్ల రుణాలను మంజూరు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన ఒక్కో సభ్యురాలికి వ్యా పారం చేసుకునేందుకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. అయితే మహిళలు గ్రామాల్లోని పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారు బిజినెస్‌లో నష్టపోకుండా ఉండేందుకు వ్యాపార మెళకువలు, నైపుణ్యాన్ని సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఒకే రకమైన వ్యాపారం చేసుకోకుండా విభిన్నంగా చేసేలా ప్రోత్సహిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నారు. కాగా స్వయం సహాయక సంఘాల్లోని చాలామంది సభ్యులు క్రింద ఉన్న వివిధ రకాల వ్యాపారాలను ఎంచుకున్నారు.
అవి.. ఉత్పత్తి రంగంలో పేపర్ప్లేట్లు, బేకరీ, ఇటుకల తయారీ, విస్తరాకు తయారు యంత్రం, స్నాక్స్ యూనిట్, బాస్కెట్ తయారు, స్టేషనరీ, రైస్‌మిల్, చేనేత ఉత్పత్తి పరిశ్రమల వ్యాపారాలు.. ట్రేడింగ్ రంగంలో కిరాణా షాపులు, బట్టల వ్యాపారం, గాజుల దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయల వ్యాపారం, డెయిరీ, పౌల్ట్రీ, గుడ్ల వ్యాపారం, ఫెర్టిలైజర్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాపు లు.. సర్వీసు రంగంలో హోటల్, టిఫిన్ సెంటర్, టైలరింగ్, మటన్, చికెన్ షాపులు, పిండిగిర్ని, వాటర్‌ప్లాంట్, పాలవ్యాపారం, బ్యూటీపార్లర్, మొబైల్ ఫోన్ మెకానిక్, మెడికల్ షాప్, టెంట్ సైప్లె సర్వీసు, వెల్డింగ్‌షాప్, కెమెరా ఫొటో స్టూడియో మొదలైనవి. కాగా జిల్లాలో 657 గ్రామసంఘాలుండగా.. స్వయం సహాయక సంఘాలు- 20,294 అందులో సభ్యులు 1,63,321 మంది ఉన్నారు.