మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - May 12, 2020 , 00:28:58

అడిగిన వెంటనే జాబ్‌కార్డు

అడిగిన వెంటనే జాబ్‌కార్డు

  • ఎక్కువ మందికి ఉపాధి హామీ పనులు
  • అందుబాటులో 22.95 కోట్ల మొక్కలు  
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: ఆర్థిక మాంద్యం, మరోవైపు కరోనా వైపరీత్యం, వేసవి కాలం దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్ని జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లను ఆదేశించారు.  పట్టణాలు, నగరాల్లో పనులు చేసుకునే చాలామంది తిరిగి వాళ్ల ఊర్లకు చేరారని, అలాంటి వారు కోరితే వెంటనే జాబ్‌ కార్డు జారీ చేసి, పని కల్పించాలని అన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి పనులు కల్పించాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా అధికారులు కచ్చితంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల్లో కూలీల భద్రత, నర్సరీలు, ఇంకుడు గుంతలు, వైకుంఠ ధామాల అంశాలపై కలెక్టరేట్‌ నుంచి అన్ని జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లతో మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో పేదలను ఆదుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూలీల భద్రతకు మాస్కులు అందించాలని, భౌతిక దూరం పాటించా లని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 12,486  పంచాయతీల్లో 22,78,059 మంది ఉపాధి కూలీలు పని కోసం నివేదించారన్నారు. ఒక్కో పంచాయతీ నుంచి సగటున 182 మంది కూలీలు పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 45 శాతం ఉపాధి కూలీలు పెరిగారన్నారు. ఉపాధి హామీ పనుల్లో టాప్‌లో రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయని అన్నారు. రాష్ట్రంలో 12,738 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయ గా, అందులో 22.95 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సీజన్‌లో నాటడానికి 14.19కోట్ల విత్తనాలు సిద్ధం చేశారన్నారు. 44.39 లక్షల ఇంకుడు గుంతలే లక్ష్యంగా 3.74 లక్షలు గుంతల పనులు ప్రారంభమయ్యాయి. 12,770 పంచాయతీల్లో వైకుంఠధామాలు అవసరం ఉండగా 12,472 గ్రామాల్లో స్థలాలు గుర్తించామని, ఇందులో 11,508 పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, స్పెషల్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఎంజీఎన్‌ఆర్‌ ఈజీ ఎస్‌ ప్రత్యేకాధికారి సైదులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.