షాబాద్, జూన్ 28 : అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. పవర్లోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్‌ను రెట్టింపు చేసి రూ. 4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున అందిస్తామని ప్రకటించి, ఇప్పుడు విస్మరించడంపై ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రంగారెడ్డిజిల్లాలో 1,95,482 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు.
ఎన్నికల ముందు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పథకం కింద పింఛన్‌ను రెండింతలు పెంచుతామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో ఆశపడి మద్దతిస్తే..18 నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయీ పెంచలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ కంటే గత కేసీఆర్ ప్రభుత్వమే తమను ఎంతగానో ఆదుకున్నదని గుర్తు చేసుకుంటున్నారు. పలు గ్రామాల్లో ప్రతినెలా పింఛన్‌ను తీసుకునేందుకు లబ్ధిదారులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
కేసీఆర్ ఇచ్చిన పింఛనే కొనసాగింపు…
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో పేదల కోసం ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో.. పదేండ్లపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పేదలంతా తమ కుటుంబాలను నెట్టుకొచ్చారు. గతంలో 65 ఏండ్లు ఉన్న వారికి మాత్రమే మంజూరయ్యే వృద్ధాప్య పింఛన్ నిబంధనను 57 ఏండ్లకు కుదించి అమలు చేసింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, ఆసహాయులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 అందించింది.
అయితే కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌ను రెట్టింపు చేసి రూ. వృద్ధులకు రూ.4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున అందిస్తామంటూ గత ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పింఛనే ఇప్పటికీ లబ్ధిదారులకు అందుతున్నది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్‌ను పెంపి అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో 1,95,482 మంది లబ్ధిదారులు..
జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 1, 95,482 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లను పొందుతున్నారు. వారిలో 76,254 మంది వృద్ధులు, 82,306 మంది వితంతువులు, 26,660 మంది దివ్యాంగులు, 804 మంది చేనేత కార్మికులు, 2,303 మంది గీత కార్మికులు, 14 మంది బీడీ కార్మికులు, 6,401 మంది ఒంటరి మహిళలు, 57 మంది ఫైలేరియా, 683 మంది డయాలసిస్ బాధితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ మాత్రమే ఇప్పుడు అందుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ కొత్త పింఛన్ల జాడేలేదు. గత 18 నెలలుగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నామని పలువురు పేర్కొంటున్నారు.
మాట నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వృద్ధులకు రూ.4,016, దివ్యాంగులకు రూ.6,016 ఇస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు పట్టించుకోకపోవడం దారుణం. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా పింఛన్ల పెంపు ఊసేలేదు. పింఛన్ డబ్బులు పెరుగుతాయని ఎంతోమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.
-పొట్ట మల్లేశ్, దివ్యాంగుడు, చేవెళ్ల
ఇంకెప్పుడు పెంచుతారు..?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే పింఛన్ డబ్బులను పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ పెంచకుండా మోసం చేస్తున్నది. ఇంతకుముందు కేసీఆర్ సార్ రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,016కి పెంచి ఆదుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్‌ను పెంచి ఆదుకోవాలి. ఇప్పటికే 18 నెలలు దాటింది.. ఇంకెప్పుడు పెంచుతారు..?
-బేగరి మల్లయ్య, వృద్ధుడు, అంతారం, చేవెళ్ల
ప్రజలే గుణపాఠం చెబుతారు
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చడంలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్‌ను రెండింతలు చేసి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పటికీ దాని గురిం చి మాట్లడకపోవడం దారుణం. గ్రామాల్లో కొత్త పింఛన్ల కోసం ఎంతోమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పింఛన్లను పెంచి పంపిణీ చేయాలి. లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
-సూద యాదయ్య, బీఆర్ఎస్ సీనియర్ నేత, హైతాబాద్, షాబాద్